top of page

అబద్ధాలు ఆడటం వలన కలిగే ప్రాపంచిక మరియూ అధ్యాత్మిక

నష్టాలు ఏమిటి?

 

ఇక్కడ కొంత ఉపోద్ఘాతం అవసరం. కొంతమందిని చూడగానే, మొదటి చూపులోనే మీకో అభిప్రాయం ఏర్పడిపోతుంది. కొన్నిసార్లు మీ అభిప్రాయం తప్పొచ్చు గానీ, ఎక్కువ సార్లు మీ అంచనా నిజమౌతుంది. దీనికి కారణం ఏమిటంటే, ప్రతీ ప్రాణి చుట్టూ సాధారణ కంటికి కనిపించని ఒక దివ్య కాంతి వుంటుంది. దేవుడి ఫొటోలో తల వెనుక వున్న కాంతి లాంటిది అన్నమాట. ఐతే, ఇలాంటి కాంతి పుంజం కేవలం దివ్యపురుషులకు మాత్రమే కాదు, సృష్టిలోని ప్రతి ప్రాణికీ వుంటుంది. గొప్ప వ్యక్తులకు కొంచం ఎక్కువగానూ, సాధారణ వ్యక్తులకు తక్కువగానూ, అధములకు మరింత తక్కువగానూ వుంటుంది. ఈ కాంతి పుంజాన్ని మన కాన్షస్ మైండ్ చూడలేదు కానీ, మనలో వుండే సూపర్-కాన్షస్ మైండ్ (ఆత్మ) చూడగలుగుతుంది. అందుకే మనం కొంతమందిని ఎలాంటి పరిచయమూ లేకపోయినా కూడా వారిని చదివేయగలుగుతాం. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. అబద్ధాలు ఎందుకు చెప్పకూడదు?

ప్రాపంచిక కారణాలు:
ఒక వ్యక్తి యొక్క కాంతిపుంజంలో ఆ వ్యక్తి యొక్క మొత్తం తత్వమూ కనిపించేస్తూ వుంటుంది. ఉదాహరణ: మన సమాజంలో 99% పైగా మనుష్యులు భయస్తులై వుంటారు. అందుకే, భయస్తులు అందరూ ముందు జాగ్రత్తగా కొత్తవారు పరిచయం ఐనప్పుడు మా అంకుల్ పోలీస్ కమీషనర్ అనో, మినిస్టర్ అనో చెప్తూ, మాకు ఇంతుందీ అంతుందీ అంటూ కోతలు కోసేస్తూ వుంటారు. సరిగ్గా వాళ్ళు ఇలా కోతలు కోస్తున్న సమయంలోనే, ధర్మ మార్గంలో నడిచే వ్యక్తులకు ఆ కోతలుకోసే వ్యక్తి యొక్క కాంతిపుంజం ద్వారా నిజం తెలిసిపోతుంది. ఐతే, ఎదుటి వ్యక్తి చెప్పేవన్నీ నిజాలు కావని తెలిసికూడా ధర్మ మార్గంలో నడిచేవారు హేళన చేయకుండా, నమ్మినట్లు తల వూపుతారు. మీకు ఎంత ఎక్కువగా అబద్ధాలు చెప్పే అలవాటుంటే అంత ప్రస్ఫుటంగా మీ చుట్టూ వున్న కాంతిపుంజం మీ నిజస్వరూపాన్ని ఎదుటివారికి, వారు ధర్మ మార్గంలో నడవకపోయినా గానీ, పట్టిచ్చేస్తూ వుంటుంది. ఎంత ఎక్కువ అబద్ధపు జీవితాన్ని గడుపుతారో అంత ఎక్కువగా సాదా సీదా మనుష్యులకు కూడా దొరికిపోతారు. అందుకే అత్యవసర సందర్భాలలోనే అబద్ధాలు చెప్పండి.

మన ఆగ్రహాన్ని ఎందుకు ప్రదర్శించాలి?
చాలామంది ఆగ్రహాన్ని నటిస్తుంటారు. అలాంటి ఉత్తుత్తి ప్రదర్శన వలన మీ కాంతిపుంజం మీ చేతకానితనాన్ని ఇతరులకు పట్టిచ్చేస్తుంది. అందుకే అవసరమైనప్పుడు నిజంగానే కటువుగా వుండండి. తప్పదనుకుంటే, ఎదుటివారి దవడ పేలగొట్టండి. అప్పుడే మీ తత్వం యొక్క నిజస్వరూపాన్ని మీ కాంతిపుంజం ద్వారా తెలుసుకున్న వ్యక్తులు మీతో వొళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తారు. ఉదాహరణ: గతంలో మీరు ఒక ఇద్దరి దవడ పేలగొట్టారనుకోండి. అలాగే, ఒక వ్యక్తిమీద ప్రతీకారం తీర్చుకున్నారనుకోండి. అలాగే, మరో ఇద్దరిని మీ ఫ్రెండ్ లిస్టులోంచి లేదా బంధువుల లిస్టులోంచి జీవితాంతం బహిష్కరించారనుకోండి. మరోకరి మీద పోలీసు కేసుపెట్టి జైలుకి పంపించారనుకోండి. ఇవన్నీ కూడా మీ కాంతిపుంజం ఇతరులకు అనుక్షణం తెలియచేస్తూ వుంటుంది. తద్వారా మీతో ఎలా డీల్ చెయ్యాలో, ఎలా ప్రవర్తించకూడదో, మిమ్మల్ని మోసం చెయ్యొచ్చో చెయ్యకూడదో, చేస్తే అదెంత ప్రమాదమో తదితర విషయాలను మీ ముఖం పై బోర్డు వ్రాసి పెట్టినట్లు మీ కాంతిపుంజం ప్రదర్శనకు పెడుతుంది. ఐతే, ఇవన్నీ అలౌకికాలు కనుక సాధారణ కంటికి కనిపించవు. కనిపించనివన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తే, అది మీ ఇష్టం.

నా ఉద్దేశ్యం ఏమిటి?
ఇలాంటి విషయాలను బోధించటం వెనుక నా ఉద్దేశ్యం మీరు అందరితోనూ గొడవలు పెట్టుకొమ్మని కాదు. కనీసం తప్పనిసరి పరిస్తితులలోనైనా మీ నిజమైన స్వరూపాన్నీ లేదా తత్వాన్నీ బయటపెడితే, ఆ తత్వానికి తగ్గట్టుగా భవిష్యత్తులో మీతో డీల్ చేసే వ్యక్తులకు మీ గురించి ఒక సుస్పష్టమైన అవగాహన కలిగి అందుకనుగుణంగా మీతో ప్రవర్తిస్తారు. ఇది ఇరుపక్షాలకూ లాభదాయకం. ఐతే, నేనిచ్చే ఈ సలహా అందరికీ ఒకేలా వర్తించదు. అది మీయొక్క, వయస్సు, లింగం, ప్రొఫెషన్, అంతస్తూ తదితరాలమీద ఆధారపడి వుంటుంది.

కొంతమందిని అంచనా వెయ్యటంలో మనం ఎందుకు విఫలం అవుతాం? 

దీనికి మూడు కారణాలు వున్నాయి. 1- ఎదుటి వ్యక్తి తన ఆలోచనలు మీకు తెలియకూడదని మనసులో బలంగా కోరుకుంటున్నాడు. ముఖ్యంగా దుష్టాలోచనలున్నవారు ఇలా కోరుకుంటారు. 2- ఆ వ్యక్తికంటే ఆ క్షణంలో మీ అంతర్గత శక్తి తక్కువగా వుంది. 3- ఆ విషయానికి ఆ క్షణంలో మీరు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే, మీ ప్రాధాన్యాలు వేరే వున్నాయి.

అధ్యాత్మిక కారణాలు:
ఈ కొత్తతరం పిల్లలకు తెలియని పదం ఒకటుంది. దానిపేరే వాక్శుద్ధి. ఒక వ్యక్తి చెప్పిన మాటలు ఎన్ని ఎక్కువ సార్లు నిజం కాకుండాపోతాయో అంత ఎక్కువగా అతని కోరికలు తీర్చుకునే శక్తి కూడా క్షీణిచిపోతుంది. అందుకే వాక్కు శుద్ధంగా వుండాలంటారు. ఫలానా సబ్జెక్టులో మీకు 90% మార్కులు కావాలన్నా, వచ్చే 5 సంవత్సరాలలో 5 కోట్లు సంపాదించాలన్న కోరికైనా, మంచి ఆరోగ్యాన్ని పొందడం అనే కోరికైనా, మోక్షం పొందాలన్న అధ్యాత్మిక కోరికైనా -  కోరిక ఏదైనా సరే, వాక్శుద్ధి వున్నప్పుడే ఆ కోరికకు బలం చేకూరుతుంది.

విన్నపం:
ఈ మెస్సేజ్ లో కొంతైనా పనికొచ్చే విషయం వుంది అని మీరనుకుంటే కనుక, దయచేసి ఇతరులకు ఫార్వార్డు చేయగలరు. ధన్యవాదములు!

 

www.VEDAuniversity.com
 

bottom of page