top of page

స్వర్గం భూమి మీదే వుండేదా?

 

డిశెంబరు 8 వ తేదీ గీతా జయంతి సందర్భముగా ఫార్వార్డు చేయబడిన ఒక మెస్సేజ్ చదివాను. ఐతే, ఆ మెస్సేజులోని సమాచారములో ఒక చిన్న పొరపాటు దొర్లింది. రాజ్యాన్ని వదిలిన తరువాత పాండవులు హిమాలయాలకు వెళ్ళిపోయారు అని వుంది. నిజానికి వారు వెళ్ళింది హిమాలయాలకు కాదు, హిమాలయాలకు ఆవలనున్న స్వర్గానికి కాలినడకన ప్రయాణించారు. చాలామంది, పండితులతో సహా, ఈ విషయములో తప్పుడు సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. అందుకే ఈ మెస్సేజ్. మార్గమధ్యములో ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులంతా మరణిస్తారు. ఒక్క ధర్మరాజు మాత్రమే స్వర్గానికి చేరగలుగుతాడు. 

 

ఈ విషయాన్ని అధ్యయనం చేసిన తరువాత నాకు వచ్చిన అనుమానం, స్వర్గం అంటే వేరే గ్రహం కాదా? వేరే గ్రహానికి కాలినడకన వెళ్ళలేము కదా? పరిశోధనానంతరం, నాకు ఈ క్రింది విషయాలు అవగతమయ్యాయి.

 

స్వర్గలోకం అని పిలవబడే ప్రాంతం భూమి మీదే వుండేది. ఇప్పుడు మనం ఉత్తర ధ్రువం అని పిలుస్తున్న ప్రాంతమే ఒకప్పటి స్వర్గలోకం. నేనొక్కడినే ఇలా ఆలోచిస్తున్నానా అని మొదట్లో భయం వేసింది. మనందరికీ స్వాతంత్ర్య వీరుడిగా పరిచయమైన శ్రీ బాలగంగాధర తిలక్ కూడా, ఈ విషముపై పరిశొధన చేసి ఉత్తర ధ్రువాన్నే స్వర్గముగా తేల్చి చెప్పారని తెలిసిన తరువాత నా పరిశోధనను ధైర్యముగా కొనసాగించాను. ఈ క్రింది విషయాలు నా పరిశోధనకు మరింత బలాన్నిచ్చాయి.

 

మన శాస్త్రాలు స్వర్గములో ఆరు నెలలు పగలూ, మరో ఆరు నెలలు రాత్రులూ వుంటాయని చెప్పాయి. అంటే, సూర్యుడు సరీగ్గా ఆరు నెలలపాటు ప్రకాశిస్తాడు. ఆరు నెలల తరువాతే సూర్యాస్తమయం జరుగుతుంది. ఇప్పటి ఉత్తర ధ్రువములో, సరిగ్గా ఇలాగే జరుగుతుంది. అక్కడ ఎలాంటి జనావాసాలూ లేకపోవటం వలన, కేవలం వాతావరణ పరిశోధన కేంద్రాలు మాత్రమే వుండటం వలన, మనకు ఆ ప్రాంతం పై సరైన అవగాహన కలుగలేదు. ఏకధాటిగా ఆరు నెలలు చీకటిలో వుంటూ, ఎప్పుడూ మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో వుండే ఆ ప్రాంతం ఇప్పటి మానవులకు నివాసయోగ్యం కాదు. అలాగే, మన శాస్త్రాలు మరో విషయాన్ని కూడా చెప్పాయి. దేవతలకు ఒక రోజు అంటే మనకు ఒక సంవత్సరం అని. నిజమేకదా, ఉత్తర ధ్రువములో ఆరు నెలలపాటు కొనసాగే పగలూ, మరో ఆరు నెలలపాటు కొనసాగే రాత్రీ కలిపితే ఒక రోజు. అదే సమయములో మనకు, 365 పగళ్ళూ, మరో 365 రాత్రుళ్ళూ వస్తాయి. 

 

అలాగే స్వర్గములో పగలు కొనసాగుతున్నప్పుడు, నరక లోకములో రాత్రి కొనసాగుతుంది. అంటే, ఇప్పటి దక్షిణ ధ్రువం ఒకప్పటి నరక లోకమన్నమాట.

 

నా పరిశోధన నిమిత్తం హిమాలయాలలో ఏ ప్రాంతాన్ని నివాసముగా చేసుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు, శ్రీ దలైలామా ఇంటర్వ్యూని చదవటం జరిగింది. అందులో ఆయన ఈ క్రింది విషయాలు చెప్పారు. 1959 లో టిబెట్ నుంచి శరణార్ధిగా భారత్ వచ్చినప్పుడు, నెహ్రూ గారు ఆయనకు సుసంపన్నమైన ముస్సోరి హిల్ స్టేషనును ఇచ్చారు. కానీ ఒక సంవత్సరము తరువాత శ్రీ దలైలామా 1960 లో నెహ్రూ గారిని అభ్యర్ధించి ధర్మశాలను తమకు ఇమ్మని అడిగారు. అంత మంచి ముస్సోరిని వదులుకొని, ధర్మశాల వంటి పాడుపడిన ప్రదేశాన్ని ఎందుకు కోరుకున్నారు అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగితే, శ్రీ దలైలామా చెప్పిన సమాధానం ఇది: దేవలోకం అనేది వేరే గ్రహం కాదు. కాలచక్రాన్ని అద్యయనం చేసిన తరువాత, ఇప్పటి ధర్మశాల పరిసర ప్రాంతాలే ఒకప్పటి దేవలోకం అని తెలిసింది.

 

ఆయన మాటలను నమ్మి వేదాలపై పరిశోధనకు నేను నా కుటుంబముతో సహా ధర్మశాలకు నా నివాసాన్ని మార్చుకున్నాను. ఆ తరువాతే నా పరిశోధనలో ఒకప్పటి దేవలోకం ఇప్పటి ఉత్తర ధ్రువం అని తెలిసింది.

 

ఈ విషయానికి సంబంధించిన నా పూర్తి పరిశోధనను, మరో రెండూ లేక మూడు సంవత్సరాలలో విడుదలయ్యే నా తదుపరి పుస్తకం, "ది ఒరిజినల్ వేద" లో వివరించటం జరుగుతుంది.

 

Courtesy:

www.VEDAuniversity.com

bottom of page