top of page

అందరికీ అర్ధమయ్యేలా వేద విజ్ఞాన పరిచయం - 8

ఎనిమిదవ అధ్యాయం: రెఫ్రిజిరేటర్లో పెట్టిన ఫలములు, కూరగాయలు! 

గమనిక: ఈ అధ్యాయంలో కొంత భాగం మాత్రమే వేదానికి సంబంధించిన అంశం. మిగిలిన అంశాలు ఆరోగ్యానికి సంబంధించినవి. 

 

మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఫలములు, కాయగూరలు, ఆకులు, పువ్వులు తదితరాలను చెట్టు లేదా మొక్క నుంచి తెంపిన తరువాత కూడా అవన్నీ కొన్ని రోజులపాటు ప్రాణాలతోనే వుంటాయి. తెంపివేయబడిన తరువాత కూడా అవి తమకి కావలసిన శక్తిని గాలినుంచి, సూర్యకాంతి నుంచీ గ్రహించగలుగుతాయి. ఐతే, చెట్టు లేదా మొక్క నుండి తెంపివేయబడటం వలన, వాటికి నీటి సరఫరా ఆగిపోవటమే కాకుండా కిరణజన్య సమ్యోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారుచేసుకునే అవకాశాన్నీ కోల్పోతాయి. నీరు, ఆహారం తయారుచేసుకునే అవకాశం లేకపోయినా కానీ కనీసం కొన్ని రోజులపాటు అవి జీవించగలుగుతాయి.

జీవాహారం
ఫలములు, కాయగూరలు, ఆకులు, పువ్వులు తదితరాలన్నీ కూడా కొన్ని కోట్ల కణముల సముదాయం అని గుర్తుంచుకోవాలి. ఒక్కొక్క కణమూ ఒక ప్రత్యేక జీవి. అలాగే, ఒక్క ఫలములో కొన్ని కోట్ల కణములు వుంటాయి. ఈ కణములన్నీ కూడా చెట్టు లేదా మొక్క నుండి తెంపివేయబడిన కొన్ని రోజులపాటు ప్రాణాలతోనే వుంటాయి. అందుకే వాటిని తెంపివేయబడిన తరువాతకూడా జీవాహారంగానే (జీవించి వున్న) పరిగణిస్తారు. రెఫ్రిజిరేటర్లో పెట్టకపోతే పాలను కూడా జీవాహారంగానే పరిగణించాలి.

మృతాహారం
ఫలములు, కాయగూరలు, ఆకులు, పువ్వులు తదితర జీవించి వున్న పదార్ధాలను రెఫ్రిజిరేటర్లో పెట్టినప్పుడు రెండు విషయాలు జరుగుతాయి.

1- వీటిని చెట్టు లేదా మొక్క నుండి తెంపినప్పుడూ, ఆహారాన్ని వండేముందు వాటిని ముక్కలుముక్కలుగా తెగ్గొట్టినప్పుడూ మరియూ వండటం కోసం పొయ్యిమీద పెట్టేటప్పుడూ బాధను అనుభవిస్తాయి. ఐతే ఆ బాధ కొద్దిసేపు మాత్రమే వుంటుంది. కానీ వాటిని రెఫ్రిజిరేటర్లో పెట్టినట్లైతే, ప్రతిక్షణం చిత్రహింసను అనుభవిస్తూ చాలాసేపటికి మరణిస్తాయి. ఒకాసారిగా మరణం ప్రాప్తించకుండా అత్యంత చల్లని వాతావరణంలో పెట్టి తద్వారా గంటలకొద్దీ బాధించి చంపబడటం వలన, వాటిని బాధించడం వలన జనించిన కర్మ అందుకు కారణం అయినవారి ఖాతాలోకి జమ అవుతుంది. 

 

2- జీవించి వున్న లేదా కొద్ది నిముషాల క్రితమే మరణించిన ప్రాణుల ఆహారాన్ని తినటం వలన మనం ఆరోగ్యంగా జీవిస్తాం. కానీ ఎప్పుడో మృతి చెందిన జీవులను, అదికూడా చాలా గంటలపాటు ప్రతీ క్షణం నరకాన్ని అనుభవిస్తూ మృతి చెందిన వాటిని, భుజించటం అంటే ఆహారంలో ప్రతిరోజూ కొంచం విషాన్ని కలుపుకొని తినటమే అవుతుంది.

ఒక్కసారి ఆక్సిజన్ కనుక మృత శరీరంలోకి ప్రవేశిస్తే, ఆ శరీరం కుళ్ళిపోవటం మొదలౌతుంది. ఆక్సిజనును శరీరంలోనికి ప్రవేశించకుండా అడ్డుకునే శక్తి ఏంటీ ఆక్సిడెంట్లకు మాత్రమే వుంటుంది. ఫలములు, కాయగూరలు, ఆకులు, పువ్వులు తదితరాలను చెట్లు లేదా మొక్కలనుంచి తెంపివేసిన తరువాత కూడా అవి ప్రాణాలతో వుండటం వలన, వాటి శరీరంలో వుండే ఏంటీ ఆక్సిడెంట్లు వాటి శరీరాలను ఆక్సిజనీకరణ జరగకుండా అడ్డుకోగలుగుతాయి. కొన్ని గంటలపాటు వాటిని రెఫ్రిజిరేటర్లో పెట్టిన తరువాత మృత శరీరాలుగా మారిపోతాయి కనుక, వాటిని బయటకు తీసినప్పుడు ఆక్సిజనీకణకు గురై కుళ్ళిపోవటం మొదలౌతుంది. ఈ లోపులోనే మనం వండటం మొదలుపెట్టేస్తాం కనుక దుర్వాసన మనకు చేరదు.

 

తక్షణ కర్తవ్యం
1- ఫలములు, కాయగూరలు, ఆకులు, పువ్వులు తదితరాలను ఎయిర్ కండీషండ్ షాపులనుంచి కాకుండా సంతలనుంచీ లేదంటే రోడ్డుపక్కన వుండే చిన్న చిన్న కొట్లనుంచీ, తోపుడు బండ్లనుంచీ మాత్రమే కొనండి.

2- ఫలములు, కాయగూరలు, ఆకులు, పువ్వులు తదితరాలను రెఫ్రిజిరేటర్లో పెట్టకండి.

3- వారానికి రెండు సార్లు మార్కెట్టుకు వెళ్ళటం అనే అలవాటును చేసుకుంటే రెఫ్రిజిరేషన్ అవసరమే వుండదు.

 

మానసిక దౌర్భల్యం

కూరగాయలను కొన్న తరువాత మరికొద్ది గంటలలోనో లేదా రెండు రోజుల వ్యవధిలోనో వండుకుంటామని తెలిసినా, రెండు మూడు రోజులు రెఫ్రిజిరేటర్లో పెట్టకపోయినా అవి పాడవ్వవు అని తెలిసికూడా వాటిని ఇంటికి తెచ్చిన వెంటనే అనవసరంగా రెఫ్రిజిరేటర్లో పెట్టడం అన్నది నిస్సందేహంగా ఒకరకమైన మానసిక దౌర్భల్యమే.

క్షమార్పణలు
నేను స్వయంగా ఆచరిస్తున్న విషయాలనే ఇతరులకు బోధిస్తాను. కానీ, ఈ ఒక్క విషయం మాత్రం నేను ఆచరించలేకపోతున్నాను. ఇతర కుటుంబ సభ్యుల సహకారం లేకుండా కొన్ని పనులు ఆచరించటం కష్టం అవుతుంది. క్షమించగలరు.

వేద విజ్ఞానం ఏడవ పాఠం సమాప్తం. మరోసారి, మరో పాఠాన్ని చదువుకుందాం.

మరింత విజ్ఞానం కోసం, ఆసక్తి కలవారు నేను నిర్వహించే ఈ క్రింది వెబ్ సైటు నుంచి నా పుస్తకాలను ఉచితంగానే చదువుకోవచ్చు లేదా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. క్షమించాలి, అన్ని పుస్తకాలూ ఆంగ్లం లోనే వ్రాయబడినవి.

Courtesy: www.VEDAuniversity.com

bottom of page