top of page

అందరికీ అర్ధమయ్యేలా వేద విజ్ఞాన పరిచయం - 6

ఆరవ అధ్యాయం: అన్నదానం వలన కలిగే కష్టాలు!

 

విజ్ఞప్తి: మనందరికీ చిన్నప్పటినుంచీ నేర్పించబడిన జ్ఞానానికీ, మనలో ఎంతో లోతుగా పాతుకుపోయిన అభిప్రాయాలకూ, ఈ క్రింది విషయాలు కోపాన్నీ, బాధనూ కలుగచేయవచ్చు. మానసికంగా అందుకు ముందుగానే సంసిద్ధులు కాగలరు.

మనలో చాలామంది అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పదని అనుకొని, చేసిన తప్పుడు పనులను కడిగేసుకోవటానికో లేక పుణ్యంకోసమనో అన్నదానాలు చేస్తుంటారు. కాస్త బుర్రపెట్టి ఆలోచించండి. కొన్ని జీవులను చంపి తయారుచేసిన ఆహారం, అది శుద్ధ శాఖాహారమైనాసరే, మరో జీవికి దాన్ని దానముగా ఇవ్వటం వలన ఏమిటి లాభం? ఒక వంద యూనిట్ల పుణ్యం మీ ఖాతాలో పడొచ్చు, కానీ, ఆ వంద యూనిట్ల పుణ్యంతో పాటు ఒక పదివేల యూనిట్ల కర్మ కూడా మీ ఖాతాలో పడుతుందని మర్చిపోవద్దు. మరెందుకు అన్నదానం అత్యంత గొప్పదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి? 

మీకు మంచిని కలుగచేసే అన్నదానాలు రెండు రకాలు: 


1-    ప్రతిరోజూ ఇంట్లో వండుకున్న ఆహారాన్ని ముందుగా అతిథులకు దానం చేయటం. 


2-    మీ శతృ గ్రహాలేవో తెలుసుకొని, ఆ గ్రహాలకు చెందిన ఆహారాన్ని, ఆ గ్రహాలను మిత్ర గ్రహాలుగా కలవారికి దానం చేయటం. ఉదాహరణకు, శని గ్రహం మీకు శతృ గ్రహమైనచో, శని గ్రహాన్ని ఆకర్షించే నువ్వులను శని గ్రహాన్ని మిత్ర గ్రహంగా కలిగిన వారికి గానీ, లేదంటే శివాలయంలో భక్తులకు పంచటం కోసం ప్రసాదంగా గానీ ఇవ్వొచ్చు. శివాలయం అని ఎందుకన్నానంటే, వాస్తు ప్రకారం కట్టబడిన శివాలయం శని గ్రహాన్ని ఆకర్షిస్తుంది కనుక. దురదృష్టవశాత్తూ, మీలో చాలామందికి ఇలాంటి విషయాలమీద అవగాహన లేదు కనుక, అన్నదానానికి దూరంగా వుండటమే మేలు.

కోసి, ఉప్పూ కారం పెట్టి, మంటపెట్టి, వేడి నూనెలో వేయిస్తున్నప్పుడు మనం ఎంతో లోకువగా చూసే చిన్ని చిన్ని ప్రాణులైన కాయగూరలలోని కణాలు మరణానికి ముందు ఎంత దారుణమైన హింసకూ, బాధకూ గురౌతాయో కదా? ఆ పాపం ద్వారా జనించిన కర్మను ఎవరి ఖాతాలో వేద్దాం?

మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, మనం చేసే పుణ్యం మనం గతంలో చేసిన పాప ఫలితాన్ని తగ్గించేస్తుందని భ్రమిస్తుంటారు. నిజానికి, పాపం, పుణ్యం అనేవి రెండు వేర్వేరు అంశాలు. మీరు ఎంత గొప్ప పుణ్యం చేసినా సరే, పాప ఫలితాన్ని అనుభవించాల్సిందే. మీరు చేసిన పుణ్య ఫలితాన్ని కూడా అనుభవించాల్సిందే. అంతేగానీ, కొంత పుణ్యంతో కొంత పాపాన్ని రద్దు చేయవచ్చు అనేది పూర్తిగా అసత్యం.

సరే, పాపం సంగతి ఎలా వున్నా, ఎంతో కొంత పుణ్యం వస్తుంది కదా అని అన్నదానం చేసారనుకోండి. ఆ మాటకొస్తే, అన్నదానమనేకాదు, మరి ఏరకమైన దానమైనా సరే, దాని నుంచి తగిన ఫలితాన్ని పొందాలంటే దానికి కొన్ని విధి విధానాలు వున్నాయి.

1- కర్మ అంటుకోని దానం, లేదా అతి తక్కువ కర్మ అంటుకునే దానం: ఈ ఆధునిక యుగంలో ఆర్ధిక సహాయం అనేది అత్యుత్తమ దానం. ఎందుకంటే, మీరు చేసిన ధన సహాయంతో, సహాయం పొందిన వ్యక్తి, తిరిగి ఆ ధనాన్ని ఎందుకోసం ఉపయోగిస్తాడో మీకు తెలియదు కనుక. అతను ఆ ధనాన్ని ఆహరం కోసం ఉపయోగిస్తే, తద్వారా జనించిన కర్మ ఫలితాన్ని అతనే అనుభవించాలి. అలాక్కాకుండా, ప్రత్యక్షంగా మీరే ఆహారాన్ని దానం చేయటం వలన, ఆయొక్క ఆహారం కోసం మీరు పాల్పడిన హింసకు ఫలితంగా జనించిన కర్మ మీ ఖాతాలో జమ ఔతుంది.

 

2- గుప్త దానం: దానం చేస్తూ, ఆ సమయంలో తీసుకున్న చిత్రాలను సోషల్ మీడియా ద్వారా గానీ, మరే ఇతర పద్ధతులద్వారా గానీ ఇతరులకు తెలియపరిచే ప్రయత్నం చేస్తే ఏమౌతుందో తెలుసా? ఆ దానం ద్వారా ఉత్పన్నమైన మొత్తం కర్మ మీ ఖాతాలోనే జమ ఔతుంది. ఎందుకంటే, అటువంటి ప్రచారం వలన దానం తీసుకున్న వారికంటే మీకే ఎక్కువ లాభం కలిగింది కాబట్టి. అందుకే దానం ఎప్పుడూ గుప్తంగానే చేయాలని శాస్త్రం చెప్తోంది. బాగా గుర్తుంచుకోండి, ఎక్కువ కర్మ ఎప్పుడూ ఒక పని వలన ఎక్కువ లాభం పొందిన బెనెఫీషియరీ అక్కౌంటులోకే వెళ్తుంది.

 

3- నిజంగా అవసరంలో వున్నవాడే దానం పుచ్చుకోవటానికి అర్హుడు: నిజాయితీగా చెప్పండి, రెండు మూడు రోజులుగా ఆహారం దొరక్క పస్తులున్నవారిని మీరు ఎంతమందిని చూసారు? మీరు దానం చేసిన అన్నాన్ని భుజిస్తున్న వందమందిలో కనీసం ఒక్కడైనా పస్తులతో పడుకున్నవాడు వున్నాడా? అన్నదానమనే కాదు, అది ఏరకమైన దానమైనాసరే, దానం పుచ్చుకున్న వ్యక్తి నిజంగానే తీవ్రమైన అవసరంలో వుండి తీరాలి. అప్పుడే మీకు అతితక్కువ కర్మతో కూడిన అత్యంత ఎక్కువ పుణ్యం లభిస్తుంది.

ఆఖరి మాట:
దానం ఇవ్వటానికి మీరెవ్వరూ, తీసుకోవటానికి అతనెవ్వరు? మీరు దానం ఇస్తున్నారంటే, దాని అర్ధం మిమ్మల్ని దైవశక్తి అలాంటి పనికి ఉపయోగించుకొంటుంది అని అర్ధం. దైవశక్తి చేతిలో మీరు కేవలం ఒక పనిముట్టు మాత్రమే. అందుకే ఇతరులకు సహాయం చేసినప్పుడు మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. అలాగే మీనుంచి సహాయం పొందిన వ్యక్తి మీకు కృతజ్ఞుడై వుండాలనుకోవటం కూడా మూర్ఖత్వమే ఔతుంది. ఎందుకంటే, ఎప్పుడైతే ఫలితాన్ని ఆశించి సహాయం చేస్తామో అప్పుడు, సహాయం చేసిన మీరే ప్రప్రధమ బెనెఫీషియరీ అవుతారు. ఒక వ్యక్తి వలన, ఇప్పుడుగానీ, మరెప్పుడైనాగానీ ఎలాంటి ప్రయోజనమూ మీకు ఉండే అవకాశం లేదని తెలిసీ మీరు ఆ వ్యక్తికి సహాయం చేస్తే, అదే నిజమైన సహాయం అవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే, ముక్కూ ముఖం తెలియనివారికి చేసేదానినే సహాయం అని పిలవవచ్చు. 

వేద విజ్ఞానం ఆరవ పాఠం సమాప్తం. మరోసారి, మరో పాఠాన్ని చదువుకుందాం.

మరింత విజ్ఞానం కోసం, ఆసక్తి కలవారు నేను నిర్వహించే ఈ క్రింది వెబ్ సైటు నుంచి నా పుస్తకాలను ఉచితంగానే చదువుకోవచ్చు లేదా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. క్షమించాలి, అన్ని పుస్తకాలూ ఆంగ్లం లోనే వ్రాయబడినవి.

Courtesy: www.VEDAuniversity.com

bottom of page