top of page

అందరికీ అర్ధమయ్యేలా వేద విజ్ఞాన పరిచయం - 5

 

ఐదవ అధ్యాయం: వాస్తు శాస్త్రాన్ని ఆచరించాలా వద్దా?

 

 

అసలు విషయం లోకి వెళ్ళేముందు, మీరు వాస్తు శాస్త్రము పై కొంత ప్రాధమిక విషయ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అప్పుడే, ఈ శాస్త్రాన్ని ఆచరించాలా వద్దా అన్న విషయాన్ని చర్చించటానికి మీకు అర్హత లభిస్తుంది.

 

వేద మహర్షులు (ఆనాటి సైంటిస్టులు) ఈ క్రింది విషయాలను తపశ్శక్తితో కూడిన తమ పరిశోధన ద్వారా గ్రహించారు:

 

1- భూమిమీద మనుషులు ఒకటి చేయాలని అనుకుంటారు, కానీ మరొకటి చేస్తారు. దీనికి కారణం వారి ఆలోచనలను గ్రహాల ఆకర్షణ శక్తి ప్రభావితం చేయటమే.

 

2- భూమిపైనున్న మనుషుల ఆలోచనలను ప్రభావితం చేసే గ్రహాల సంఖ్య మొత్తం 9. ఇవి రెండు వర్గాలుగా విభజించబడ్డాయి. ఒక వర్గములో 5, మరో వర్గములో 4 గ్రహాలూ వుంటాయి. మీ జన్మ లగ్నాన్ని అనుసరించి, పై రెండు వర్గాలలో, ఒక వర్గం గ్రహాలు మీ ఆలోచనలను సరైన దిశగా నడిపిస్తే, మరో వర్గం గ్రహాలు మిమ్ములను వక్ర మార్గములో నడిపిస్తాయి.

 

3- భూమిమీద మనుషులు ఆకాశం క్రిందకు వచ్చినప్పుడు ఈ మొత్తం 9 గ్రహాల ప్రభావానికీ చాలా ఎక్కువగా లోనౌతారు.

 

4- ఏదైనా ఒక కట్టడం (ఇల్లు) యొక్క పొడవు, వెడల్పుకంటే సరిగ్గా రెట్టింపు వుండి, ఆ కట్టడం యొక్క ప్రధాన ద్వారం వెడల్పు వైపు వున్నైట్లైటే......అప్పుడు ఆ కట్టడం రెండు వర్గాల గ్రహాలలో ఏదో ఒక వర్గానికి చెందిన గ్రహాలను మాత్రమే ఆకర్షించి, రెండో వర్గపు గ్రహాలను ఆ కట్టడంపై తమ ప్రభావాన్ని చూపించకుండా నిరోధిస్తుంది. ఇంకా చాలా నిబంధనలు వున్నా కానీ, ప్రధానమైన ఒక్క విషయాన్ని మాత్రమే నేను ఇక్కడ చర్చించాను.

 

5- మీ జన్మ లగ్నానుసారం, మీకు గురు గ్రహ వర్గం  మిత్ర గ్రహాలైన పక్షములో (వైష్ట్నవులు), మీ ఇంటి ప్రధాన ద్వారం తూర్పు ముఖముగా వుండాలి. ఒకవేళ మీరు శని గ్రహ వర్గానికి చెందిన వారైతే (శైవులు) మీ ఇంటి ప్రధాన ద్వారం పశ్చిమానికి చూడాలన్నమాట.

 

6- గృహము అంటే ఎండా, వానా, చలి నుంచీ, దొంగల నుంచీ రక్షించే కట్టడము మాత్రమే కాదు, అది ప్రధానముగా దుష్టగ్రహాల ప్రభావాన్నుంచి రక్షించే నివాసప్రాంతమని అర్ధం.

 

ఇప్పుడు అసలు విషయాన్ని చర్చిద్దాం.

 

వేదం చెప్పినట్లుగా మనం పెళ్ళిళ్ళు చేసుకోవటం మానేసాం. వేదం చెప్పినట్లుగా పిల్లల్ని కనటం కూడా మానేసాం. ఇప్పుడు ఆధునిక మానవుడికీ జంతువులకూ ఏమాత్రం తేడా లేదు. వేదం చెప్పినట్లు జీవిత భాగస్వామిని ఎంచుకొని, వేదం చెప్పినట్లు పిల్లల్ని కంటే, అప్పుడు మాత్రమే మీ మొత్తం కుటుంబ సభ్యులంతా ఒకే వర్గానికి చెందిన వారౌతారు. అంటే, కుటుంబ సభ్యులందరూ ఇతే వైష్ట్నవులౌతారు, లేదంటే శైవులౌతారు. అలా కానప్పుడు, మీ కుటుంబములో సగం మంది ఒక వర్గానికీ, మరో సగం మంది మరో వర్గానికీ చెందుతారన్నమాట.

 

మరింత వివరముగా చెప్పాలంటే, మీకు మంచి చేసే గ్రహాలు, మీ కొడుకుకి చెడు చేసేవి కావచ్చు. అలాగే, ఒక బిడ్డ వైష్ణవ లగ్నంలో పుడితే, మరో బిడ్డ శైవ లగ్నంలో పుడుతోంది. అలాంటప్పుడు, కుటుంబం మొత్తానికి పనికివచ్చే ఇంటిని వాస్తురీత్యా నిర్మించటం సాధ్యం కాదు. అప్పుడు మీరు వాస్తు ప్రకారం కట్టిన ఇంట్లో వుండటం వలన కలిగే లాభాలు ఏమిటి? శూన్యం కదా? లాభం సంగతి తరువాత, కుటుంబములోని సగం మందికి ఆ ఇల్లు కీడుచేసి తీరుతుంది. అందుకే వాస్తుని మర్చిపోండి. లేదంటే, పూర్తిగా వేదం చూపించిన దారిలోనే నడవండి.

 

చదువూ, సంధ్యా లేక, ఎలాగోలా డబ్బు సంపాదించటమే ముఖ్యం అనుకొనే కొంతమంది పోరంబోకు వెధవలు, వాస్తు శాస్త్రం పేరుతో మీకు మనశ్శాంతి లేకుండాచేసి, మీ ఇంటి రూపురేఖలని పిచ్చి పిచ్చిగా మార్చేస్తారు. కనుక, మీ సొంత కామన్ సెన్సుని కూడా ఉపయోగించగలరు.

ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?

కుటుంబ సభ్యులు అందరూ ఒకే వర్గానికి చెందిన వారు కానప్పుడు, ఈ జనరేషను వాళ్ళు పిచ్చి పిచ్చిగా కట్టిన ఇళ్ళలో వుండటమే శ్రేయస్కరం. 100% వాస్తు ప్రకారం కట్టామని బిల్డర్లు చెప్పినా మీరు నమ్మాల్సిన పనిలేదు. గత కొన్ని దశాబ్దాలుగా కనీసం ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా భూమి మీద నిజమైన వాస్తు శాస్త్రం ప్రకారం కట్టబడలేదు.

వాస్తుని పాటించకుండానే దుష్టగ్రహాల నుంచి రక్షణ పొందటం ఎలా?

ముందుగా మీరు మీ పుట్టిన సమయం, తేదీ, సంవత్సరమూ, ప్రదేశమూ ప్రకారం మీ జన్మ లగ్నాన్ని తెలుసుకోండి. వివాహమైన స్త్రీలకు వారి భర్త జన్మ లగ్నమే వారి సొంత లగ్నముగా మారిపోతుంది. మీ జన్మ లగ్నం ప్రకారం మీరు వైష్ణవులా లేక శైవులా తెలుసుకోండి. తెలుసుకోవటానికి మీకు సహాయం చేసే వ్యక్తికి ఒక విషయం స్పస్టముగా చెప్పండి. మీ జన్మ లగ్నాన్ని సూర్యమాన పద్ధతిలో మాత్రమే గణించమని చెప్పండి. మీరు వైష్ణవులైన పక్షములో, రోజులో వీలున్నంత ఎక్కువసేపు తూర్పుముఖముగా వుండటానికి ప్రయత్నించండి. వంట చేసేటప్పుడైనా, టీవీ చూసేటప్పుడైనా, చదువుకునేటప్పుడైనా, ఆఫీసులో కూర్చున్నప్పుడైనా, ఏ పనీ చెయ్యకుండా వున్నప్పుడైనా సరే. ఇక పడుకున్నప్పుడు మాత్రం, తలను తూర్పు వైపు పెట్టుకోండి. అలాగే, మీరు శైవ లగ్నానికి చెందినవారైతే, వీలున్నంతవరకూ పశ్చిమాభిముఖులై వుండండి. పడుకునేటప్పుడు శైవులు, తలను పశ్చిమం వైపు పెట్టుకోవాలి. ఈ రకముగా, ఒకే కుటుంబానికి చెందిన వేరు వేరు గ్రహ వర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు వాస్తు ప్రకారం కట్టబడలేని ఇంట్లో వుంటూ కూడా, శుభగ్రహ ప్రభావానికి మాత్రమే లోనై, దుష్టగ్రహ ప్రభావాన్నుంచి తప్పించుకోవచ్చు.

 

వేద విజ్ఞానం ఐదవ పాఠం సమాప్తం. మరోసారి, మరో పాఠాన్ని చదువుకుందాం.

 

మరింత సమాచారం కోసం, నేను వ్రాసిన, "హౌ ప్లానెట్స్ ఇంఫ్లుయెన్స్ హ్యూమన్ ఏక్షన్స్?" అన్న ఉచిత ఆంగ్ల పుస్తకాన్ని చదవండి. నేను వ్రాసిన అన్ని పుస్తకాలూ ఈ క్రింది వెబ్ సైటులో డిజిటల్ రూపములో ఉచితముగా లభిస్తాయి. ఆన్ లైన్లోనే చదువుకోవచ్చూ, లేదంటే డౌన్ లోడ్ చేసుకోవచ్చూ.

 

Courtesy:

www.VEDAuniversity.com

bottom of page