top of page

అందరికీ అర్ధమయ్యేలా వేద విజ్ఞాన పరిచయం - 3

 

మూడవ అధ్యాయం: ఆహారం, నైవేద్యం, అన్నదానం

 

 

విజ్ఞప్తి

మనందరికీ చిన్నప్పటినుంచీ నేర్పించబడిన జ్ఞానానికీ, మనలో ఎంతో లోతుగా పాతుకుపోయిన అభిప్రాయాలకూ, ఈ క్రింది విషయాలు కోపాన్నీ, బాధనూ కలుగచేయవచ్చు. మానసికంగా అందుకు ముందుగానే సంసిద్ధులు కాగలరు.

 

కష్టాలన్నీ వరుసగా ఎదురైనప్పుడూ, లేదంటే ఒక పెద్ద కష్టం విపరీతమైన బాధకు గురిచేసినప్పుడూ, మనమందరమూ కూడా ఒక మాట అంటూంటాము - "తెలిసీ నేనెవరినీ మోసం చెయ్యలేదు, ఎవరికీ అన్యాయం చెయ్యలేదు, మరి నాకెందుకు భగవంతుడు ఇంత పెద్ద శిక్షను విధించాడు?"

 

మీరు ఇలా ఆలోచించారంటే దాని అర్ధం ఏమిటో తెలుసా? మనుషులను తప్ప మిగిలిన ప్రాణికోటిని మీరసలు ప్రాణులుగానే గుర్తించటం లేదు అని అర్ధం. అన్ని దుర్మార్గాలలోకెల్లా, ఇలాంటి ఆలోచనే అతి పెద్ద దుర్మార్గం. మీరు ఊపిరి తీసిన ప్రతిసారీ గాలిలో వున్న ఎన్నో సూక్ష్మజీవులు మీ శరీరంలోకి ప్రవేశించి మరణిస్తాయి. మీరు తినే ఆహార పదర్ధాలు కూడా కణ సముదాయాలే కదా? కణములు (సెల్స్) కూడా ప్రాణులే కదా? శాఖాహారమైనాసరే అది కూడా కణాల సముదాయమే. మొక్కలు కూడా భాధపడతాయనీ, ఏడుస్తాయనీ ఆధునిక ప్రపంచానికి మొదటిసారిగా తన సైన్సు పరిశోధనలతో సశాస్త్రీయముగా నిరూపించిన సైంటిస్టు మన భారతీయుడు, జగదీష్ చంద్రబోస్. ప్రతిరోజూ ఇన్ని కోట్ల కణాలను చంపి తిన్న పాపం వూరికే పోదు కదా? అందుకని, ఈ ప్రపంచంలో మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు అని రెండు రకాల మనుషులు లేరు. అందరూ ఎంతోకొంత హింసకు పాల్పడుతూ పాపం చేసేవారే. ఐతే, ఈ పాపాన్ని అతి తక్కువుగా చేస్తూ బ్రతకడం, తద్వారా అతి తక్కువ కర్మను మన ఖాతాలో జమచేసుకోవటం ఎలా అన్నదే మనకు వేదం బోధిస్తూంది.

 

మొదటి తరగతి ఆహారం

వైద్య పరిభాషలో సస్పెండెడ్ ఏనిమేషన్ అన్న ఒక మాట వుంది. దాని అర్ధం, మనిషి బ్రతికే వుంటాడు, కానీ శరీరం మాత్రం కదలదూ, మెదలదూ! ప్రాచీన కాలములో మన ఋషులు తపస్సు చేసేటప్పుడు అలాగే బ్రతికేవారు. గంటకు ఒక్కసారో రెండుసార్లో ఊపిరి తీసుకుంటున్న వ్యక్తి యొక్క ముక్కు దగ్గర వ్రేలు పెట్టినా అతను శ్వాసిస్తున్నాడన్న విషయం మీకు తెలిసే అవకాశమే లేదు. తమ కర్మను శూన్యం చేసి తద్వారా ముక్తిని పొందాలనుకొన్న ఆ ఋషులు, తపస్సు చేస్తున్నప్పుడు కూడా ప్రతీరోజూ సుష్టుగా భోజనం చేస్తూ, నిముషానికి 20 సార్లు ఊపిరి తీస్తే, కొత్తగా మళ్ళీ కర్మ ప్రోగుపడుతుందన్న భయంతో, సస్పెండెడ్ ఏనిమేషన్ లోకి వెళ్ళిపోయేవారు. అత్యవసర పరిస్థితిలో ప్రాణం నిలుపుకోవటం కోసం తిరిగి బాహ్య ప్రపంచంలోకి వచ్చి, ఆకులూ, అలములూ తినేవారు. కనుక, ఇదే అతి తక్కువ కర్మను కలుగచేసే మొదటి తరగతి ఆహారం. అలాగని, మిమ్మల్నందరినీ అదే ఆహారాన్ని తినమని చెప్పబోవటం లేదు. మీకు విషయం సమగ్రంగా అర్ధం అయ్యేలా చెప్పటం కోసం కొన్ని అనవసర విషయాలను కూడా నేను ప్రస్తావించాల్సి వస్తూంది, క్షమించండి మరి.

 

రెండవ తరగతి ఆహారం

ముక్తికోసం ప్రయత్నించే ప్రతీవారూ ఋషులంత నిష్టగా వుండలేరు. మరి కొత్తగా కర్మను ప్రోగు చేయకుండా మంచి భోజనాన్ని పొందాలంటే ఏమి చెయ్యాలి? అందుకే సన్యాసులు యాచించగా వచ్చిన ఆహారాన్ని మాత్రమే తినేవారు. యాచకుడి ఖాతాలో కర్మ జమ అవ్వకూడదంటే ఏమి చెయ్యాలి? ఏ ఇంటిలో ఐతే అందరూ ఆహారాన్ని భుజించేయగా మిగిలిపోయిన ఆహారం వుందో అలాంటి ఇంటికి మాత్రమే వెళ్ళి యాచించాలి. ఇప్పుడు అర్ధమైందా, చిన్నప్పుడు మన ఇంటికి సన్యాస యాచకులు రాత్రి పది గంటల సమయంలోనే ఎందుకు వచ్చేవారో? ఒక యాచకుడు ఒకే వీధిలో ప్రతిరోజూ అడుక్కుంటుంటే, కొంత మంది గృహిణులు ప్రతిరోజూ వచ్చే ఆ యాచకుడిని మనసులో పెట్టుకొని, మరికొంత ఎక్కువ ఆహారాన్ని వండుతారు. అలాంటి భోజనాన్ని తిన్న యాచకుడికి కర్మ అంటుకుంటుంది. అందుకే, ఒకప్పటి సన్యాస యాచకులు, వెళ్ళిన వీధికి కొన్ని రోజులపాటు వెళ్ళకుండా, ఒక క్రమాన్ని పాటించకుండా, ఎప్పుడో ఒకసారి ఆకస్మికంగా మళ్ళీ ఆ వీధిలో ప్రవేశించేవారు. ఇలా యాచించగా పొందిన ఆహారమే తక్కువ కర్మను కలుగచేసే రెండవ తరగతి ఆహారం.

 

మూడవ తరగతి ఆహారం

మీ ఇంటికొచ్చే అతిథులకోసం మాత్రమే (మీకోసం కాదు) ఆహారం వండి, అతిథులందరూ భోజనం చేయగా మిగిలిపోయిన ఆహారాన్ని భుజించటం వలన మీకు ఏ కర్మా అంటుకోదు. అతిథులంటే కేవలం మీ బంధువర్గం మరియూ మిత్రులు మాత్రమే కాదు, రోడ్డున పోయే యాత్రికులూ, పరదేశీయులూ కూడా అతిథులే. తాను రాబోతున్నట్లు ఒక అతిథి మీకు ముందుగా సమాచారమందిస్తే, ఆ అతిథికి కర్మ అంటుకుంటుంది. ముందుగా ఎంతమంది అతిథులు వస్తున్నారో తెలిసిపోతే మీరుకూడా అతిథుల అవసరానికి మించి వండుతారు. ఎందుకంటే మీకు కూడా కొంత మిగలాలి కదూ. అలా చేస్తే అలాంటి ఆహారం తిన్న కర్మ మీకు కూడా చుట్టుకుంటుంది. అందుకే ఏమాత్రం పరిచయంలేని వారికి కూడా మనవారు ఒకప్పుడు ఆతిథ్యమిచ్చేవారు. అతిథిదేవోభవ అన్న మాటకు అర్ధం ఇదే. ఒకప్పటి భారతీయులు కనీసం ఒక్క అతిథి అయినా రాకపోతే భోజనం చేసేవారే కాదు. కర్మ అన్నా, ఆ కర్మ వలన జీవితంలో ఎప్పటికైనా అనుసరించి వచ్చే కష్టాలన్నా వారు అంతగా భయపడే వారు. ఇలా అతిథులకు పెట్టగా మిగిన ఆహారం కొంతలో కొంత తక్కువ కర్మను కలుగ చేసే మూడవ తరగతి ఆహారం.

 

నాల్గవ తరగతి ఆహారం

వండిన ఆహారం మొత్తాన్నీ దేవుడికి నైవేద్యంగా పెట్టి, తరువాత అదే ఆహారాన్ని మనం తినటం. లేదంటే తినే ముందు ఒక ముద్ద ఆహారాన్ని దేవతలకు అర్పించి, మిగిలిన ఆహారాన్ని మనం తినటం. ఐతే, మీ నటనను అర్ధం చేసుకోలేనంత తెలివిహీనుడు కాదు సృష్టికర్త. దేవుడు గానీ, దేవతలు గానీ మీరు అర్పించే ఆహారాన్ని తినలేరనీ, అదంతా మీ కడుపు నింపుకోవటం కోసం మాత్రమేననీ మీకు తెలిసినా, భక్తిని నటిస్తూంటారు. మీరెంత నటించినా, ఇలాంటి ఆహారాన్ని భుజించినప్పుడు పూర్తి కర్మ మీ ఖాతాలోనే జమ అవుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, వాస్తు ప్రకారం నిర్మించిన గుడిలో అర్పించిన నైవేద్యానికీ, మీ ఇంటిలో అర్పించిన నైవేద్యానికీ సంబంధం లేదు. గుడిలో అర్పించే నైవేద్యం వెనుక వున్న కారణం పూర్తిగా వేరు. గుడిలో అర్పించే నైవేద్యం గురించి మనం తదుపరి అధ్యాయాలలో చర్చిద్దాం.

 

దేవుడికి నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా గానీ మీకోసం వండుకున్న ఆహారం మీకు కర్మను కలిగిస్తుంది. ఇలాంటి ఆహారాన్ని అతి తక్కువ కర్మతో ఎలా తయారుచెయ్యాలో ఇప్పుడు చూద్దాం.

 

మీకు అర్ధం అవ్వటం కోసం ఉజ్జాయింపుగా చెప్తున్నాను. దీనినే ప్రామాణికం అని అనుకోవద్దు. ఒక కిలో వండని గింజలతో మరియు కాయగూరలతో మీకు లభించే పోషక పదార్ధాలు, రెండు నుంచి నాలుగు కిలోల వండిన ఆహారములో లభించే పోషక పదార్ధాలతో సమానం. అందుకే, తక్కువ కర్మతో కడుపు నింపుకోవాలంటే, వండని పచ్చి ఆహారాన్ని కనీసం రోజుకి ఒక్క పూట అయినా భుజించండి. అలాగే, ఆరోగ్యకరముగా వండిన రెండు కిలోల ఆహారములో లభించే పోషక పదార్ధాలు, నాలుగు కిలోల అనారోగ్యకరమైన ఆహారములో లభిస్తాయి. ఇక్కడ అనారోగ్యకరమైన ఆహారం అంటే, బాగా మసాలాలు దట్టించిన వేపుడు పదార్ధాలు అని అర్ధం. మొత్తానికి మీకు చివరగా చెప్పేది ఏమిటంటే, అతి తక్కువ హింసతో చేసిన ఆహారం, అసలు వృధా చేయకుండా, లేదంటే అతి తక్కువగా వృధా చేస్తూ తినే ఆహారం వలన మనకు అతి తక్కువ కర్మ చుట్టుకుంటుంది అని. అన్నం పరబ్రహ్మమనీ, ఆహారాన్ని వృధా చేయవద్దనీ చెప్పటానికి ఇదే కారణం. ఈరకముగా వీలున్నంత తక్కువ కర్మను కలిగించే ఆహారాన్ని నాల్గవ తరగతి ఆహారం అని అంటము.

 

ఐదవ తరగతి ఆహారం

ఇదే అన్ని ఆహారాలలోకీ అత్యంత హేయమైన ఆహారం. ఎందుకంటే, అన్ని రకాలలోకీ అత్యధిక మొత్తంలో కర్మను ప్రోగు చేస్తుంది కనుక. అదే నీచమైనది అని పిలువబడే మాంసాహారం. కొన్ని వందల వేల కిలోల గింజలూ, గడ్డీ, కాయగూరల ఆహారాన్ని నెలలూ, సంవత్సరాల తరబడి ఒక జంతువుచేత తినిపించి, బలిపించి, తరువాత దాన్ని చంపి కోయగా వచ్చే ఒకటి నుంచి 50 కిలోల మాంసాన్ని తినటం ద్వారా మనం చేసేదే తిరిగి ఒక్క జీవితములో తరిగించుకోలేంత అతి పెద్ద కర్మ. పెద్దమొత్తంలో కర్మను మన ఖాతాలో జమ అయ్యేలా చేసే ఇలాంటి నీచమైన ఆహారాన్నే మనం ఐదవ తరగతి ఆహారముగా పరిగణిస్తాం.

 

ఆన్నదానం

మనలో చాలామంది అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పదని అనుకొని, చేసిన తప్పుడు పనులను కడిగేసుకోవటానికో లేక పుణ్యంకోసమనో అన్నదానాలు చేస్తుంటారు. కాస్త బుర్రపెట్టి ఆలోచించండి. కొన్ని జీవులను చంపి తయారుచేసిన ఆహారం, అది శుద్ధ శాఖాహారమైనాసరే, మరో జీవికి దాన్ని దానముగా ఇవ్వటం వలన ఏమిటి లాభం? ఒక వంద యూనిట్ల పుణ్యం మీ ఖాతాలో పడొచ్చు, కానీ, ఆ వంద యూనిట్ల పుణ్యంతో పాటు ఒక పదివేల యూనిట్ల కర్మ కూడా మీ ఖాతాలో పడుతుందని మర్చిపోవద్దు. మరెందుకు అన్నదానం అత్యంత గొప్పదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి? మీకు మంచిని కలుగచేసే అన్నదానాలు రెండు రకాలు: 1- ప్రతిరోజూ ఇంట్లో వండుకున్న ఆహారాన్ని ముందుగా అతిథులకు దానం చేయటం. 2- మీ శతృ గ్రహాలేవో తెలుసుకొని, ఆ గ్రహాలకు చెందిన ఆహారాన్ని, ఆ గ్రహాలను మిత్ర గ్రహాలుగా కలవారికి దానం చేయటం. ఉదాహరణకు, శని గ్రహం మీకు శతృ గ్రహమైనచో, శని గ్రహాన్ని ఆకర్షించే నువ్వులను శని గ్రహాన్ని మిత్ర గ్రహంగా కలిగిన వారికి గానీ, లేదంటే శివాలయంలో భక్తులకు పంచటం కోసం ప్రసాదంగా గానీ ఇవ్వొచ్చు. శివాలయం అని ఎందుకన్నానంటే, వాస్తు ప్రకారం కట్టబడిన శివాలయం శని గ్రహాన్ని ఆకర్షిస్తుంది కనుక. దురదృష్టవశాత్తూ, మీలో చాలామందికి ఇలాంటి విషయాలమీద అవగాహన లేదు కనుక, అన్నదానానికి దూరంగా వుండటమే మేలు.

 

ఆఖరి మాట

మీలో ఎవరికైనా పైన వివరించిన విషయాలు మూఢనమ్మకాలుగా, ఆధునిక విజ్ఞాన శాస్త్ర విరుద్ధంగా గానీ అనిపిస్తే.......నిజమైన మూఢత్వాన్ని మీకిప్పుడు ఒక్క పేరాలో పరిచయం చేస్తాను. రోజంతా మీరు చేసే పనికి 2,000 కిలో కెలోరీల ఆహారం సరిపోతుందని తెలిసి కూడా, 3,000 కెలోరీల ఆహారాన్ని భుజించి, రాత్రికి చేసే పని ఏమీ లేకపోయినా గానీ, మళ్ళీ ఇంకొక 2,000 కెలోరీల అహారాన్ని భుజించచటం కోసం, పొట్టని సర్దుబాటు చెయ్యలేక, వీధులంటా, రోడ్లంటా, ప్లే గ్రౌండులంటా, పార్కులంటా కిలోమీటర్ల తరబడి నడవటం, అదీ కాదంటే, అపార్టుమెంటు బిల్డింగులోని కారు పార్కింగు స్థలం చుట్టూనో లేక టెర్రస్ మీదో పిచ్చివాడిలా రౌండ్లు కొట్టటం అతి పెద్ద అజ్ఞానం, అవివేకం మరియూ మూర్ఖత్వం. దీనికన్నా కూడా గొప్ప అజ్ఞానం మరొకటుంది. ఎవరైతే రాత్రుళ్ళు జీర్ణవ్యవస్థకు విశ్రాంతినిస్తారో వారి శరీరంలో ప్రతీ రాత్రీ కణాల మరమ్మత్తు జరిగి, చాలా రకాలైన అంతర్గత శరీర వ్యవస్థలు రాత్రంతా పూర్తి విశ్రాంతిని అనుభవించి వారిని మరుసటిరోజు పనికి సిద్ధం చేస్తాయని తెలిసి కూడా, ఏ మాత్రం అవసరం లేకున్నా, మళ్ళీ రాత్రికి కూడా భోజనం చేసేసి, జీర్ణవ్యవస్థకు విశ్రాంతినివ్వకుండా రాత్రి కూడా పని కల్పించి, కణాల మరమ్మత్తును కూడా జరగనివ్వకుండా అడ్డుపడి, 10 గంటల సుధీర్ఘ నిద్ర తరువాత కూడా మరుసటి రోజుని అలసటతో, నిస్సత్తువతో ప్రారంభించటం. ఉదయపు అలసటకూ నిస్సత్తువకూ కారణమేమిటో తెలుసా? మీరు అనవసరంగా తిన్న రాత్రి భోజనాన్ని ఖర్చుపెట్టలేక, ఏమిచేసుకోవాలో తెలియక, రాత్రంతా మీ శరీరంలో నిద్ర మానుకొని మేల్కొని వున్న కణాలు ఆ అధిక ఆహారాన్ని కొవ్వుగా మార్చి, ఆ అధిక కొవ్వుని ఇప్పటికే కొవ్వుతో నిండిపోయిన మీ శరీరములో ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయో వెతుక్కుని మరీ కొవ్వుని అక్కడకి తరలించటం. వేద విజ్ఞానాన్ని మూఢనమ్మకాలుగా అవహేళన చేసే ఓ ఆధునిక విజ్ఞానాభిలాషీ, అన్నిటికన్నా హేళన చేయతగ్గ అతిపెద్ద జోక్ ఇప్పుడు చెప్తాను వినండి. అనవసరముగా రాత్రి భోజనం చేసి, రాత్రంతా శరీర అంతర్గత అవయవాలకు నిద్రను దూరంచేసి, అవి అనవసరపు ఆహారాన్ని ఎంతో శ్రమించి కొవ్వుగా మారిస్తే, ఆ కొవ్వుని వదిలించుకోవటం కోసం, డాక్టరు చెప్పాడని ఉదయం లేవగానే మళ్ళీ వీధులంటా, రోడ్లంటా, ప్లే గ్రౌండులంటా, పార్కులంటా పరిగెత్తటమే నిజమైన మూఢత్వం మరియూ అజ్ఞానం. అవసరానికి మించి తినటమంటే, అనవసరంగా అధిక కర్మను మన ఖాతాలో జమ చేసుకోవటమే.

 

వేద విజ్ఞానం మూడవ పాఠం సమాప్తం. మరోసారి, మరో పాఠాన్ని చదువుకుందాం.

 మరింత విజ్ఞానం కోసం, ఆసక్తి కలవారు నేను నిర్వహించే ఈ క్రింది వెబ్ సైటు నుంచి నా పుస్తకాలను ఉచితంగానే చదువుకోవచ్చు లేదా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. క్షమించాలి, అన్ని పుస్తకాలూ ఆంగ్లం లోనే వ్రాయబడినవి.

 

www.VEDAuniversity.com

bottom of page