top of page

అందరికీ అర్ధమయ్యేలా వేద విజ్ఞాన పరిచయం - 2

రెండవ అధ్యాయం: పెళ్ళి, పిల్లలు


 
ఈ మధ్య కొంతమంది ప్రవచనకారులు, వేదం ఏమి చెప్తోంది అన్న విషయాన్ని ప్రక్కనపెట్టి, వివిధ అంశాలపై ప్రజలను తిడుతూ బుద్ధిచెప్పటమే పనిగా పెట్టుకున్నారు. అందులో అతి ముఖ్యమైన అంశమే కుటుంబ సభ్యుల మధ్య సంబంధ భాంధవ్యాలు. భార్యను కేవలం పనిమనిషిలా చూసే భర్త, వృద్ధాప్యంలో తల్లిదంద్రులను మెడపట్టుకొని బయటకు గెంటివేసే పిల్లలు....తదితర సంఘటనలు జరగటానికి వేదం చెప్పే మూలకారణాలను ఇప్పుడు చూద్దాం. 
 
మీరు ఎవరికి ఎక్కడ ఎప్పుడు పుట్టారు, ఎక్కడ ఎప్పుడు పుట్టిన వ్యక్తిని పెళ్ళి చేసుకున్నారు, ఎప్పుడు మీ భార్యాభర్తల సంగమాలు జరిగాయి, తిరిగి ఎప్పుడు ఎక్కడ మీ పిల్లలకు జన్మనిచ్హారు, ఏ ఇంటిలో ఎవరెవరితో కలిసి మీరు నివసిస్తునారు అన్న వేదిక్ ఆస్ట్రాలజీకి సంబంధించిన ప్రాధమిక విషయాలే మీ కుటుంబ సభ్యుల మధ్యనుండే సంబంధ భాందవ్యాలను నిర్ణయిస్తాయి. ఈ ప్రాధమిక విషయాన్ని విస్మరించి, ఎవరైనా వారి పిల్లలందరూ వారి వారి పెళ్ళిళ్ళు అయిన తరువాత కూడా చక్కగా కలిసి వుండాలని, తల్లిదండ్రులను గౌరవించాలనీ, చిన్నప్పటినుంచీ ప్రతిరోజూ వారికి ఉద్భోదించినా కూడా, ఆ వ్యక్తి ఉద్భోదలన్నీ చివరకు గాలికి కొట్టుకుపోవాల్సిందే. అందరూ చివరికి చెట్టుకొకరూ, పుట్టకొకరుగా కొట్టుకుపోవాల్సిందే. ఒకవేళ కలిసి వున్నా, ప్రతిరోజూ గొడవపడుతూ బ్రతకాల్సిందే. సంపాదనా తదితర కారణాలవలన విడిపోయి దూరంగా వున్నాకూడా ఒకరినొకరు శత్రువుల్లా చూసుకుంటూ బ్రతకాల్సిందే. ఈ సమస్య తీవ్రత ఇంకా బాగా అర్ధం కావాలంటే, ఒక్కసారైనా ఫామిలీ కోర్టుకు వెళ్ళి చూడండి.
 
ఎవరిని వివాహం చేసుకోవాలి?

శైవ లగ్నాలలో పుట్టిన వారు వైష్ట్ణవ లగ్నాలలో పుట్టిన వారినీ, వైష్ట్ణవ వర్గానికి చెందిన వారు శైవులనూ వివాహం చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అన్న భేదాభిప్రాయాలు రాకుండా వుండాలంటే, ఒకరు మగవాళ్ళకు చెందిన రాశిలో పుట్టివుండి, మరొకరు ఆడవాళ్ళకు చెందిన రాశిలో పుట్టినవారై వుండాలి. ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేసే వైజ్ఞానికులు కనీసం ఒక్కసారైనా వేదిక్ ఆస్ట్రాలజీని మూఢనమ్మకంగా నిరూపించే ప్రయత్నం ఎందుకు చేయలేదు? వివాహమైన మరుక్షణం నుంచీ భార్య యొక్క వర్గం భర్త వర్గంలోకి మార్పు చెందుతుంది. అంటే భార్యాభర్తలిరువురూ వైష్ట్ణవులుగా లేదంటే ఇద్దరూ శైవులుగా లెక్కించబడతారు.

గమనిక
నిజమైన వేదిక్ ఆస్ట్రాలజీ ఎప్పుడూ సౌరమాన కాలెండర్నే ఉపయోగిస్తుంది. చంద్రమాన పద్ధతి ఇక్కడ పనికిరాదు. ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యంలో వున్న చంద్రమాన పద్ధతి సరైన ఫలితాలని అందించటంలో ఘోరంగా విఫలమవ్వటంతో, నేటి తరం ప్రజలకు జ్యోతిష శాస్త్రంపై నమ్మకం పోయింది. చాలామందికి తెలియని విషయమేమిటంటే, వేదిక్ ఆస్ట్రాలజీ యొక్క ప్రధానోద్దేశ్యం భవిష్యత్తుని ముందుగానే చెప్పటం ఎంతమాత్రం కాదు. చక్కటి జీవనవిధానానికి ఏ సమయంలో ఏమిచేయాలో, ఎవరితో ఎవరికి పొసుగుతుందో, ఏది మంచో ఏది చెడో చెప్పేదే వేదిక్ ఆస్ట్రాలజీ.
 
ఎవరికి జన్మనివ్వాలి?

తండ్రి శైవుడైనంత మాత్రంచేత అతనికి పుట్టిన పిల్లలు శైవులైపోరు. అదేవిధంగా వైష్ట్ణవులు కూడా. జన్మతహా తండ్రి ఏ వర్గానికి చెందినవాడో, పిల్లలు కూడా తప్పనిసరిగా ఆ వర్గానికే చెందినవారై వుండాలి. అలా కానప్పుడే, ఆ కుటుంబం మనస్పర్ధలకు లోనై విచ్చిన్నమౌతుంది. తండ్రి వర్గానికి చెందిన పిల్లలకు జన్మనివ్వటం కోసమే భార్యాభర్తల మధ్య జరిగే సంగమానికి కూడా ముహూర్థం నిర్ణయిస్తారు. కానీ, మన తరంలో ఈ ముహూర్తాన్ని కేవలం మొదటిరాత్రికే పరిమితం చేసేసారు. వాస్తవం ఏమిటంటే, మొదటి రాత్రి మొదలైన ఈ సంగమం కొన్ని వందల సార్లు జరిగితేతప్ప ఒక బిడ్డని పుట్టించలేని దౌర్భాగ్య స్థితిలోకి మనం చేరుకున్నాం. మరింత దౌర్భాగ్యం ఏమిటంటే, చాలామంది వందలసార్లు కలిసినా పనిజరుగక పోవటంతో, సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతుంటారు. ఒక్కొక్కటీ 10 నుంచి 30 వేల రూపాయిల ఖరీదుచేసే ఊరూ పేరూ లేని ఇంజెక్షన్లను వరుసగా ఒక పదో పన్నెండో పొడిపించుకొని, మళ్ళీ సంగమానికి సంసిద్ధులౌతారు. మళ్ళీ మామూలే, "పని" జరుగదు. మళ్ళీ ఇంజెక్షన్లూ, మళ్ళీ సంగమం.......ఆధునిక వైద్య విజానం అనే ఈ సిగ్గులేని కార్యక్రమం మనలో చెప్పు తీసుకొని కొట్టేవాడు ఎవడూ లేక మూడు పువ్వులూ ఆరు కాయలుగా సాగిపోతూనే వుంది. ఏదైనా శారీరక లోపం వున్న ఒకటి రెండు కేసులలో తప్ప, మిగిలిన దంపతులందరూ కేవలం రెండంటే రెండేసార్లు ముహూర్తం చూసుకొని సంగమిస్తే చాలు, చక్కటి బిడ్డపుట్టే అవకాశాన్ని మనకు వేదం ప్రసాదించింది. ఇక, శారీరక లోపం వున్నవారు కూడా వైదిక జీవన విధానాన్ని పాటిస్తే, సహజసిద్ధంగానే లోపాలను సరిచేసుకోవచ్చు. శృంగారంలోని మాధుర్యంకోసం వెయ్యి సార్లు సంగమించొచ్చు. కానీ పిల్లలను పుట్టించటానికి మాత్రం అతి తక్కువ సార్లతో పని ముగించాలి. లేదంటే, వందల సార్లు ముహూర్తం చూసుకొని సంగమించటం సాధ్యం కాక, దుర్ముహూర్త సమయంలో సంగమించి, తద్వారా ఆ కుటుంబానికేకాక, సమాజానికి కూడా భారంగా పరిణమించే పిల్లలకు జన్మనివ్వాల్సివస్తుంది. కానీ, మన దృష్టిలో వేదిక్ ఆస్ట్రాలజీ అంటే మాఢనమ్మకం!
 
ఏ ఇంటిలో నివశించాలి?

వైష్ట్ణవ కుటుంబం తూర్పు ముఖద్వారం కలిగిన ఇంట్లోనూ, శైవ కుటుంబం పడమర ముఖద్వారం కలిగిన ఇంట్లోనూ నివశించాలి. ఇతర ద్వారాలు, కిటికీల విషయానికి వస్తే వైష్ట్ణవులకు తూర్పు, దక్షిణాలు మంచివి, శైవులకు పడమర, ఉత్తరాలు మంచివి. అందుకే ఆడపిల్ల తల్లిదండ్రులు అల్లుడి ఇంటిలో నివశించకూడదు, అల్లుడు ఇల్లరికం వెళ్ళకూడదు. ఎందుకంటే, అల్లుడూ, మామగారూ, రెండు వేరు వేరు వర్గాలకు చెందిన వారు కనుక. శైవులకు చెందిన ఇల్లు వైష్ట్ణవులకు చెరుపు చేస్తుంది, వైష్ట్ణవులకు చెందిన ఇల్లు శైవులకు చెరుపు చేస్తుంది. ఐతే, ఈ రోజులలో వాస్తు ప్రకారం కట్టిన ఇల్లు ఒక్కటంటే ఒక్కటీ లేదు కనుక, ఎవరు ఎవరితోనైనా నివశించేయొచ్చేమో.
 
ఇప్పుడు అర్ధమైందా, ఎలా జీవిస్తే ఆ కుటుంబంలోని అందరి కుటుంబ సభ్యుల మధ్య చక్కటి సంబంధ భాందవ్యాలతో కూడిన అనుబంధమేర్పడి, సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించే అవకాశం కలుగుతుందో?
 
వైదిక జీవనం ఆచరణ సాధ్యమేనా?

- ఒక్కసారి జీవిత భాగస్వామితో సంగమానికి, రెండు లక్షల రూపాయలతో 10 ఇంజెక్షన్లను పొడిపించుకోవటం ఆచరణ సాధ్యమైనది.
- అత్తింటి వారి దుర్మార్గం భరించలేక, పిల్లలతోపాటు తన వంటిపైనా కిరోసిన్ ఆయిలు పోసుకొని, 90% కాలిపోయిన వంటితో ఆసుపత్రిలో నరకం అనుభవించి చావటం సాధ్యమైనది.
- దుష్టుడైన భర్తకు పాఠం చెప్పాలనుకుందో, లాయరు ఫీజు చెల్లించటానికి డబ్బులు లేకపోయాయో కానీ, ఆమె ఫామిలీ కోర్టు ప్రాంగణంలో భర్త ఎదురుగానే తన తరుపున వాదించే న్యాయవాదితో సరసమాడుతూ అత్తింటి వారిని జైలుపాలు చేయటానికి ప్రణాళికలు రచించటమూ సాధ్యమైనది.
తల్లిదండ్రులకో, తోడబుట్టినవారికో ఒక్క వెయ్యి రూపాయలు పంపించాలంటే, భార్యకు పది అబద్ధాలు చెప్పి వెయ్యి రూపాయలను రహస్యంగా పొదుపు చేయటమూ భర్తకు సాధ్యమైనది.
- ఉద్యోగం చేస్తూ చక్కగా బంగారు బాతు గుడ్లను పెడుతున్న కూతురు, అకస్మాత్తుగా పెళ్ళిచేసుకొని వెళ్ళిపోతే కుటుంబ భారం ఎవరు మోస్తారోనన్న భయంతో, సంబంధం కుదర్చాల్సిన కన్నతండ్రే, కూతురి శీలం మంచిది కాదని పెళ్ళికొడుకు ఇంటికి ఆకాశరామన్న ఉత్తరాలు వ్రాయటమూ సాధ్యమైనది.

ఇన్ని దుర్మార్గాలు సాధ్యమైనప్పుడు, మరి వైదిక జీవనం ఎందుకు ఆచరణ సాధ్యం కాదు?
 
ఈ రోజు 5% భార్యాభర్తలు మాత్రమే విడాకులు కావాలనుకొంటున్నారు.
ఈ రోజు 10% ప్రజలు మాత్రమే సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.
ఈ రోజు 20% తల్లిదండ్రులు మాత్రమే ఒంటరిగా, పిల్లలతో సంబంధబాంధవ్యాలను తెంచుకొని తమ ఇంటిలోనో, వృద్ధాశ్రమాలలోనో చస్తూ బ్రతుకుతున్నారు.
 
ఈ శాతాలన్నీ ఎనభైకో తొంభైకో ఎగబ్రాకే రోజు దగ్గరలోనే వుందని అనిపిస్తున్నది. అప్పటికైనా ప్రపంచ ప్రజలందరూ వేదాన్ని ఆశ్రయించాల్సిందే.
 
వేద విజ్ఞానం రెండవ పాఠం సమాప్తం. మరోసారి, మరో పాఠాన్ని చదువుకుందాం.
 
మరింత విజ్ఞానం కోసం, ఆసక్తి కలవారు నేను నిర్వహించే ఈ క్రింది వెబ్ సైటు నుంచి నా పుస్తకాలను ఉచితంగానే చదువుకోవచ్చు లేదా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. క్షమించాలి, అన్ని పుస్తకాలూ ఆంగ్లం లోనే వ్రాయబడినవి.

bottom of page