top of page

అందరికీ అర్ధమయ్యేలా వేద విజ్ఞాన పరిచయం - 10

పదవ అధ్యాయం: రిటైర్మెంట్ అంటే ఏమిటి?

ఎందుకు తొందరగా రిటైర్ అయి తీరాలి?

విజ్ఞప్తి
ఇందులో చర్చించిన కొన్ని విషయాలు మీలో కొందరికి చాలా సిల్లీగా అనిపిస్తాయి. నవ్వుకోండి, ఫరవాలేదు, కానీ దయచేసి పూర్తిగా చదవండి. మహా ఐతే మీ జీవితంలో ఒక 5 నిముషాలు వృధా అవుతాయి, అంతేకదా?

చాలామంది భావిస్తున్నట్లు, రిటైర్మెంట్ అంటే వృద్ధాప్యంలో శక్తిహీనమయ్యాక ధన సంపాదనా కార్యక్రమాలనుంచి విరమణ తీసుకోవటం కాదు. రిటైర్మెంట్ అంటే నీ ప్రస్తుత జీవితంలో నీకూ, నీ మీద అధారపడిన కుటుంబసభ్యులందరికీ కేవలం ఒక్క తరానికి సరిపడా సంపాదించిన తరువాత తప్పనిసరిగా తీసుకోవలసిన విరమణ. 

ఎందుకు విరమించాలి?

మీకు తెలిసిన వాడు ఒకడు ఏరోజు సంపాదనను ఆరోజే మొత్తం ఖర్చుపెట్టేస్తున్నాడనుకోండి? అతనికి మీరేమి సలహా ఇస్తారు? భవిష్యత్తు అవసరాలకోసం కొంచం దాచుకోమంటారు కదూ. అలాగే, మీరెంతో ప్రేమించే మీ పిల్లలను ఒక 15 నుంచి 20 సంవత్సరాలపాటు చిత్రహింసలు పెట్టి వారికి విద్యాబుద్ధులు నేర్పించారు, ఎందుకు? వారి భవిష్యత్తు కోసం ఆలోచించి అలా చేసారు. ఇంత ఆలోచించిన మీరు, మరణించిన తరువాత మీ భవిష్యత్తేమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ జన్మలో కనీసావసరాలు కూడా తీరనివాడు వచ్చే జన్మ కోసం ఆలోచించకపోవటం క్షమార్హమే. కానీ, సరిపడా సంపాదించిన తరువాత కూడా, మొత్తం శక్తియుక్తులను కేవలం ఈ ఒక్క జన్మకోసం ఖర్చు చేసేయటం ఎంత మూర్ఖత్వమో కదా?

విరమించకపోతే ఏమౌతుంది?
వాటి వాటి కర్మానుసారం ప్రాణుల జన్మలు నిశ్చయమౌతాయి. ఎన్నెన్నో జన్మలపాటు జీవితం మొత్తం ఎన్నో కష్టాలూ, అవమానాలూ ఎదుర్కొన్న జీవికి ముక్తికి అవకాశమున్న మానవ జన్మ లభిస్తుంది. ఐతే ఆ మానవ జన్మ ఒక ధనవంతుడి కుటుంబంలోనా లేక ఒక దరిద్రుడి కుటుంబంలోనా అన్నది కూడా మళ్ళీ ఆ జీవి పూర్వ కర్మఫలం మీద ఆధారపడి వుంటుంది. తన మనవలూ, వారి మనవలూ కూడా కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి సంపాదించిన ఒక గొప్ప ధనవంతుడికి ఈ క్రింద ఉదహరించిన జీవులు వారసులుగా జన్మించొచ్చు.

1- ఒక్కపూట ఆహారం కోసం వంద గుమ్మాలు ఎక్కీ దిగీ జీవితాంతం అందరితో చీత్కరింపబడి, ఎంగిలాకులను నాకుతూ బ్రతికి, చివరికి లాక్ డౌన్ కారణంగా ఆ ఎంగిలాకులు కూడా లభించక, నెలరోజులపాటు ఆకలితో అలమటించి కృంగి కృశించి అత్యంత దారుణమైన మరణాన్ని పొందిన ఒక వీధి కుక్కకి ఒక ధనవంతుడి బిడ్డగా జన్మించి మరుసటి జన్మలో మానవావతారంలో కూర్చొని తినే యోగం కలుగవచ్చు.

2- సృష్టిలోని ఎన్నో జీవులు చిరకాలం జీవించి, వృద్ధాప్యంలో చక్కగా ఒక్క క్షణంలో ప్రాణాలు విడుస్తూంటే, తోటకూర మొక్కకు మాత్రం ఆ అదృష్టం లేకుండాపోయింది. చిన్నవయస్సులో బ్రతికుండగానే దానిని ఫ్రిడ్జిలో పెట్టటం వలన శీతలీకరణలో కొన్ని గంటలపాటు చిత్రహింసలు అనుభవించి మృతిచెందిన ఆ మొక్కే ఒక ధనవంతుడి ఇంట పూర్ణాయుష్కుడిగా మానవుడిగా పునర్జన్మించొచ్చు.

3- రాబోయే వర్షాకాలంలో ఇంటినుంచి బయటకు రాకుండా హాయిగా కూర్చొని తిందాం అనుకున్న ఒక చీమల గుంపు ఎంతో కష్టపడి ఒక్కొక్క ఇసుకరేణువునూ మోసుకొచ్చి గూడుని నిర్మించుకుంటాయి. తరువాత ఎంతో శ్రమించి ఒక తొంభై రోజులకు సరిపడా ఆహారాన్ని ఎంతో దూరం నుంచి మోసుకెళ్ళి గూడుకి చేరుస్తాయి. అదే ఆఖరి రోజు, రేపటినుంచి వర్షాకాలం మొదలౌతుంది. బాగా అలసిపోయిన ఒక చీమ గుంపుకి దూరమైపోయి రేపటినుంచీ అనుభవించబోయే సుఖాలనుగూర్చి కలలుకంటూ ఆద మరపుగా ఒక మనిషి బూటుకాలిక్రింద పడి నలిగి చచ్చిపోతుంది. ఆ చీమ కావలసినంత తిండి కలిగిన ఒక ధనవంతుడి ఇంట మానవావతారంలో పునర్జన్మించొచ్చు.

ఇప్పుడర్ధమైందా మీరు ఎవరికోసం శ్రమిస్తున్నారో?
ఇతరుల అవకాశాలను దెబ్బకొట్టి అవసరానికి మించి మీరు సంపాదిస్తే, ఆ సంపాదనను అనుభవించేది మరుజన్మలో మీ వారసులుగా పుట్టిన కొన్ని అనామక ప్రాణులే. అలాంటి అనామక ప్రాణులకోసం ఈ జన్మలో మీ అమూల్యమైన సమయాన్ని వృధాచెసుకోవచ్చా? మనకు జన్మనిచ్చిన వారికోసం, మన తోబుట్టువులకోసం, మన జీవిత భాగస్వామికోసం, జీవిత భాగస్వామి తలిదండ్రులకోసం, స్వయంగా మనకు జన్మించినవారికోసం మనం కష్టపడి సంపాదించటం వరకూ అది మన బాధ్యత అనిపించుకుంటుంది. వారుకూడా గత జన్మలో అనామక ప్రాణులైవుండొచ్చుగాక. మనమీద ఆధారపడే అర్హతను వారు కలిగి వున్నారు కనుక, మనం వారికోసం కొంత సంపాదించాలి. అంతటితో మీ బాధ్యత సమ్మప్తం అయ్యి తీరాలి.

అందుకే, వయసుతో సంబంధం లేకుండా వీలున్నంత తొందరగా బాధ్యతలు తీర్చేసుకొని, మిగిలిన సమయాన్ని ధన సంపాదన కోసం కాకుండా మరుజన్మ కోసం మరియూ జన్మరాహిత్యం కోసం ఆలోచించాలి.

తొందరగా రిటైర్ అవ్వకపోతే ఏమౌతుంది?
మరింత ఎక్కువ కర్మ మీ ఖాతాలో జమ అవ్వుతుంది. కర్మ పెరిగేకొద్దీ ఆ కర్మను తగ్గించుకోవటానికి మరింత దుర్భరమైన, ఎక్కువ కష్టాలను అనుభవించే అవకాశాలున్న ప్రాణిగా మరుజన్మలో జన్మించాల్సి వస్తుంది. నేను పడ్డ కష్టాలు నా పిల్లలూ, మనుమలూ, ముని మనుమలూ.......పడకూడదు అని అనుకుంటే, ఈ క్రింది రెండు పరిణామాలూ సంభవిస్తాయి.

 

ఎ) ధనవంతులకు పుట్టిన పిల్లలకు సాధారణ ప్రజలు పడే కష్టాలు వుండవు కనుక, వారి జీవితంలో మరో రకమైన కష్టాలు ఎదురౌతాయి. మొత్తానికి కష్టాలను తప్పించుకోవటం ఎవరి తరమూ కాదు, అంబానీ కొడుకులతో సహా. మరీ అపురూపంగా పెంచటానికి ప్రయత్నిస్తే, ఆ పిల్లలు మరుజన్మలోనైనా వారి ఖాతాలో వున్న కర్మానుసారం కష్టాలను మరో రకమైన జీవిగా పునర్జన్మించి అనుభవించాల్సిందే.

బి) మోక్షం పొందిన ప్రాణులు తప్ప, ప్రాణికోటి మొత్తం పునర్జన్మించాల్సిందే. ఎంతటి ధనవంతుడైనా సరే గత జన్మలో పురుగులుగా, చీమలుగా, మొక్కలుగా, జంతువులుగా, ఎవరింట్లోనో అంట్లుతోమే పనిమనుషులగా బ్రతికినవారిని ప్రస్తుత జన్మలో తమ తమ వంశాలలో జన్మించడానికి ఇష్టం వున్నా లేకపోయినా అంగీకరించాల్సిందే, విధి వ్రాతను అంగీకరించాల్సిందే.

వేద విజ్ఞానం పదవ పాఠం సమాప్తం. మరోసారి, మరో పాఠాన్ని చదువుకుందాం. మరింత విజ్ఞానం కోసం, ఆసక్తి కలవారు నేను నిర్వహించే ఈ క్రింది వెబ్ సైటు నుంచి నా పుస్తకాలను ఉచితంగానే చదువుకోవచ్చు లేదా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. క్షమించాలి, అన్ని పుస్తకాలూ ఆంగ్లం లోనే వ్రాయబడినవి.

www.VEDAuniversity.com

bottom of page