top of page

అందరికీ అర్ధమయ్యేలా వేద విజ్ఞాన పరిచయం - 1

 

ఆగండి, ఆగండి, ఇదేదో సంక్లిష్టమైన విషయం అని ఈ సందేశాన్ని చదవకుండా పక్కన పెట్టేయకండి. నేను హామీ ఇస్తున్నాను. సరీగ్గా మరో మూడు నిముషాలలో మీకు వేద విజ్ఞానంపై ప్రాధమిక అవగాహన కలిగి తీరుతుంది.

మొదటి పాఠం - మనం ఎందుకు పుట్టాం?

 

సృస్టిలోని ప్రతి ప్రాణీ, అంటే సూక్ష్మ జీవులు, చెట్లు, పక్షులు, జంతువులు, మనుషులు - అంతా కలసి ప్రతీ రోజూ కొన్ని కోట్ల కోరికలను కోరుకుంటాయి. వారి వారి కర్మానుసారం మరియూ ఆయా కోరికలను నెరవేర్చుకోవటం కోసం ఈ ప్రాణులన్నీ ఆ దిశగా చేసే ప్రయత్నాల ఫలితమే మన దైనందిన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకూ మూలం. వేదాన్ని సరీగ్గా అర్ధంచేసుకోలేకపోయిన ప్రవచనకారులు, అసలు కోరికలే లేని జీవితాన్ని గడపాలని ఉద్బోధిస్తుంటారు. ఇది అసాధ్యం. అందుకని, వీలైనన్ని తక్కువ కోరికలతో జీవితాన్ని గడపగలిగితే, జీవనం విజయవంతమౌతుంది.

వేదం ప్రకారం దేవుడు లేడు, కేవలం దైవశక్తి మాత్రమే వుంది. ఆ శక్తి ప్రాణుల యొక్క గత కర్మ మరియూ ప్రస్తుత కోరికల ప్రకారం సంఘటనలను ఆవిష్కరిస్తుంది. మనుషులతో సహా ప్రతి ప్రాణీ తమ కర్మను శూన్యం చేసుకొనేంతవరకూ, మరణించిన తరువాత కూడా ఏదో ఒక ప్రాణి రూపంలో పునర్జన్మించి, కష్టాలు అనుభవిస్తూ, తమ కర్మ శూన్యమయ్యేంతవరకూ ప్రయాసపడుతూ వుండాల్సిందే. ఈ దుర్భరమైన పునర్జన్మల చక్రాన్నుంచి బయటపడాలంటే, మోక్షం సాధించటం ఒక్కటే మార్గం. వీలైనన్ని ఎక్కువ కష్టాలను ఒక్క జన్మలోనే పూర్తిగా అనుభవించేసి మన కర్మను ఒకే జన్మలో ప్రయత్నపూర్వకంగా శూన్యం చేసుకోవటం కేవలం ఒక్క మానవ జన్మకే సాధ్యం. అందుకే అన్ని జన్మలలోకీ ఉత్తమమైనది మానవ జన్మ అని అంటారు. ఐతే, అరుదుగా లభించే ఈ మానవ జన్మను మోక్ష సాధనకు కాకుండా కేవలం కోరికలు తీర్చుకోవటానికి మాత్రమే ఉపయోగిస్తే అప్పుడు జంతు జన్మకూ, మానవ జన్మకూ ఎలాంటి బేధమూ ఉండదు. అందుకే, కుటుంబ పోషణార్ధం కొన్ని తప్పనిసరి కోరికలు నెరవేర్చుకున్న అనంతరమైనా మోక్షం వైపు అడుగులు వేసి తీరాలి.

 

అన్ని కష్టాలకంటే అతి పెద్ద కష్టం తపస్సు చేయటం. తద్వారానే మోక్షం సాధ్యం.  జంతువులు చేయలేనిదీ, కేవలం మనుష్యులు మాత్రమే చేయగలిగినది తపస్సు ఒక్కటే. సంసార భాధ్యతలన్నీ తీరిపోయిన తరువాత, అడవికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని కూడా తపస్వికుడిలా బ్రతకొచ్చు. ఒక ఇరవై యేళ్ళ తరువాత సంభవించే ఉద్యోగ విరమణానంతర జీవితం కోసం ఎన్నెన్నో ప్రణాళికలు వేసుకొనే మనం, మరణం తరువాత వచ్చే వివిధ జన్మల గురించి కనీస ఆలోచన చేయకపోవటం దారుణం. 

ఒక రోజు బ్రతకడం కోసం ఒక అర్ధకిలో బరువున్న తిండిగింజలు, కాయగూరలనూ తినవచ్చు. మన ఆహారంకోసం మనం హింసించే, చంపే మొక్కల ఉసురు వల్ల కొంత కర్మ మన ఖాతాలో జమ అవుతుంది. మనం బ్రతకాలి కనుక ఆ మాత్రం హింస చేయొచ్చు. కానీ, కొన్ని వందల వేల కిలోల ఆహారాన్ని నెలలూ, సంవత్సరాల తరబడి ఒక జంతువుచేత తినిపించి, బలిపించి, తరువాత దాన్ని చంపి కోయగా వచ్చే ఒకటి నుంచి 50 కిలోల మాంసాన్ని తినటం ద్వారా మనం ఎంత పెద్ద కర్మను పోగుచేస్తున్నామో తెలుసా?

 

అంటే, కేవలం ఒక కిలో మాంసాన్ని ఉత్పత్తి చేయటానికి వంద నుంచి కొన్ని వందల కిలోల తిండి గింజలనూ, కాయగూరలనూ హత్యచేసి ఒక జంతువుతో తినిపించాలి. తిండి గింజలనూ, కాయగూరలనూ హత్యచేయటమేమిటి అని నవ్వుకోవద్దు. వాటికీ ప్రాణముంటుంది. ఇతర మతస్తులను ద్వేషిస్తూ మెస్సేజులు పెట్టడం వలన హిందూత్వం బ్రతుకుతుందనుకోవద్దు. ఊహకు కూడా అందనంత పెద్ద స్థాయిలో కర్మను మీ ఖాతాలో జమచేసే మాంసాహారాన్ని త్యజించటం ద్వారా మరణశయ్యపై వున్న హిందూత్వానికి మీరు నిజంగానే ఊపిరిలూదగలరు. తపస్సు వలన గత కర్మను దహించివేసి మీ ఖాతాలోని కర్మను తగ్గించుకోవచ్చు సరే. మాంసాహారాన్ని త్యజించటం ద్వారా కొత్తగా జమకూడే కర్మను అమాంతం తగ్గించివేయొచ్చు మరి. గత కర్మను తగ్గించుకోవటం ఎంత ముఖ్యమో, కొత్తగా కర్మను చేయటాన్ని తగ్గించుకోవటం కూడా అంతే ముఖ్యమని గ్రహించకపోవటం క్షమించరాని తప్పా కాదా? వేద విజ్ఞానం మొదటి పాఠం సమాప్తం. మరోసారి, మరో పాఠాన్ని చదువుకుందాం.

 

మరింత విజ్ఞానం కోసం, ఆసక్తి కలవారు నేను నిర్వహించే ఈ క్రింది వెబ్ సైటు నుంచి నా పుస్తకాలను ఉచితంగానే చదువుకోవచ్చు లేదా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. క్షమించాలి, అన్ని పుస్తకాలూ ఆంగ్లం లోనే వ్రాయబడినవి.

Courtesy: www.VEDAuniversity.com

bottom of page