top of page

ఉత్తరాయణం పుణ్యకాలమైతే, జూన్ 23 నుంచి ప్రారంభమయ్యే దక్షిణాయనం పాపకాలమా?

సూర్యుడు దక్షిణ దిక్కునుంచి ఉత్తర దిక్కుకి ప్రయాణించే ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణమనీ మరియూ ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రయాణించే మరో ఆరు నెలల కాలాన్ని దక్షిణయనమనీ, ఈ రెండూ కలిపి ఒక సంవత్సరంగా వేదం నిర్ణయించింది. మన తరంలో మీడియా తనకు లాభం చేకూర్చే అభిప్రాయాలను ఎలా మనమీద రుద్దేస్తోందో అలాగే పురాతన కాలంలో కూడా జరిగేది. బలవంతుడు తన నమ్మకాన్ని సమాజంపై బలవంతంగా రుద్దేస్తాడు. ఉదాహరణ: దక్షిణ భారత దేశంలో ఎవడైనా మోసం చేస్తే, వాడు "పంగ నామం" పెట్టాడు అని అంటారు. పంగనామం అంటే "V" ఆకారంలో పెట్టే నిలువు బొట్టు. "V" కి మధ్యలో ఇంకో నిలువు గీత కూడా ఉంటుంది. అంటే, తిరుమల వేంకటేశ్వర స్వామి పెట్టుకునే మూడు నిలువు లైన్ల బొట్టు అన్నమాట. 

మరి అలాంటి దేవుడు పెట్టుకొనే బొట్టుని మోసగాళ్ళకు ఎలా అన్వయించారు? ఎందుకంటే, అప్పట్లో దక్షిణ భారతంలో 90% పైగా ప్రజలు శైవ మతస్తులు. పంగ నామం పెట్టాడంటే వాడు వైష్ణవ మతస్తుడు అని అర్ధం. శైవులు అందరూ వైష్ణవులను శతృవులుగా చూస్తారు కనుక, వైష్ణవులు పెట్టుకునే బొట్టునే కాదు, వారి సంస్కృతి మొత్తాన్నీ మోసంగానే భ్రమించారూ, ఇతరులను నమ్మించారు కూడా. అందుకే, శైవులకు మంచి చేసే ఉత్తరాయణ కాలాన్ని మాత్రమే పుణ్యకాలమని కూడా మనల్ని నమ్మించారు. వైష్ణవులు అత్యధికంగా ఉండే ఉత్తర భారతదేశంలో మాత్రం దక్షిణాయనం మొత్తాన్నీ, ముఖ్యంగా దక్షిణాయన ప్రారంభ కాలాన్ని గొప్ప పుణ్యకాలంగా చూస్తారు.

నిజానికి ఏది గొప్ప?

వేదం ఇలా చెప్తుంది: మొత్తం 12 రాశులు ఉన్నాయనీ, సూర్యుడు ఒక్కొక్క రాశిలోనూ కాస్త అటూ ఇటూగా 30 రోజులపాటూ సంచరిస్తాడనీ, దాని ఆధారంగానే నెలకు 30 రోజులూ, సంవత్సరానికి 12 నెలలూ నిర్ణయించాలనీ. అలాగే, మొత్తం 9 గ్రహాలలోనూ 7 గ్రహాలు మాత్రమే నిజంగా ఉన్నాయనీ, మిగిలిన రెండూ చాయా గ్రహాలనీ. మొత్తం 12 రాశులనూ ఈ 7 గ్రహాలకూ విభజించాలి. అప్పుడు, సూర్యుడు ఆ నెలలో ఏ రాశిలో ఉంటాడో, ఆ రాశికి చెందిన గ్రహం ఆ రాశికి అధిపతిగా నిర్ణయించాలి. మన జన్మ లగ్న రాశి (సూర్య రాశి) ప్రకారం, ఈ నెలలో సూర్యుడు సంచరిస్తున్న రాశికి అధిపతి ఐన గ్రహం మనకు మిత్ర గ్రహమో లేక శతృగ్రహమో ముందు తెలుసుకోవాలి. ఆ గ్రహం మిత్రగ్రహమైతే మనకు శుభాన్నీ, శతృగ్రహమైతే అశుభాన్నీ కలుగచేస్తుంది. 

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజుని మనం మకర సంక్రాంతి అని పండగ చేసుకుంటాం. రైతుల చేతికి ధాన్యం వస్తుంది కనుక దానిని పెద్ద పండుగగా నిర్ణయించారు అని చాలామంది అజ్ఞానులు భావిస్తుంటారు. అసలు నిజం ఏమిటంటే, మకర రాశిలో సూర్యుడు ప్రవేశించి అందులో సంచరించే మొత్తం 30 రోజుల కాలం తపస్సు చేసుకోవటానికీ లేదంటే దీక్ష చేపట్టడానికీ పనికొచ్చే అత్యుత్తమ కాలమని వేదం చెప్తోంది. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలంలోని మొదటి నెల అని అంటారు. కానీ, మకర రాశికి అధిపతి శనిగ్రహం కనుక, ఎవరికైతే శనిగ్రహం మిత్రగ్రహమో (శైవులు), వారికి మాత్రమే ఇది పుణ్యకాలం అవుతుంది. 

అలాగే, సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే రోజుని కర్క సంక్రాంతి అని అంటారు. ఈ జూన్ 23వ తేదీన కర్క సంక్రాంతి పండుగ. ఇది వైష్ణవులకు పెద్ద పండుగ. సూర్యుడు కర్కాటకంలో సంచరించే ఈ నెలంతా తపస్సు చేసుకోవటానికీ మరియూ దీక్షలు వహించటానికీ అత్యుత్తమమైన పుణ్యకాలమని వేదం చెప్తోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కనుక, చంద్రుడు మిత్రగ్రహంగా కలవారందరికీ (వైష్ణవులు) ఇది పుణ్యకాలం.

ఈ నెల గొప్పతనం ఏమిటి, మనం ఏమి చేయాలి?

మామూలు రోజుల్లో మనం ఒక పూట ఉపవాసం చేస్తే కొంత కర్మ నశిస్తుంది. మరి పుణ్యదినాల్లో చేస్తే? పెద్ద ఎత్తున కర్మ నశిస్తుంది. అందుకే వైష్ణవులు ఈ నెల రోజుల కాలాన్నీ తమ కర్మను వీలున్నంతవరకూ నశింపచేసుకోవటానికి ప్రయత్నించాలి. అంటే, నెలపొడవునా రోజుకి ఒక్క పూటే భుజించాలి. అదికూడా, మధ్యాహ్నం 12.30 నుంచి 1.15 మధ్యలో పూర్తిచేస్తే మరింత మంచిది. మధ్యలో ఆకలివేస్తే వండని ఆహారం, అంటే ఫలములూ, ఫల రసం, పచ్చి కాయగూరల రసం, మొలకెత్తిన విత్తనాలూ తినొచ్చు. అలాగే, అవకాశం ఉన్నంతవరకూ ఇతర సరదాలకు దూరంగా ఉండాలి. నిగ్రహం పాఠించాలి. అవకాశం ఉంటే, వైష్ణవులు వైష్ణవ రంగులైన ఎరుపు, పసుపు, గోధుమ, కాషాయం, ఆఫ్ వైట్ వస్త్రాలను మాత్రమే ధరించాలి. అలాగే, నవధాన్యాలలో, వైష్ణవ మిత్రగ్రహాలకు చెందిన ధాన్యాలను మాత్రమే భుజించాలి. ఆవు పాలు శ్రేష్టమైన వైష్ణవ ఆహారం. గోధుమలు, వేరుశనగ గుడ్లూ, ఎర్ర శనగలూ, కంది పప్పు తదితరాలు వైష్ణవ మిత్రగ్రహాలకు చెందిన ఆహారం.

నేను వైష్ణవుడినా లేక శైవుడినా?

సాయన పద్ధతిలో లెఖ్ఖించాలి. కానీ, వేదం చెప్పిన సాయన పద్ధతిని మనం పక్కనపెట్టి ఇతర పద్ధతులను పాఠిస్తున్నాం. అందుకే నేను మీకు చెప్పినా, మీ అంతట మీరు లెఖ్ఖించుకోవటం కష్టం కావొచ్చు. ఈ క్రింద ఉన్న మా వెబ్ సైటుకి వెళ్ళి అక్కడ ఉన్న మా ఫోన్ నంబరు ద్వారా వాట్సాప్ లో సంప్రదిస్తే, మీకు మెస్సేజు ద్వారా తెలియచేస్తాము. ఉచిత పుస్తకాలకోసం కూడా అదే వెబ్ సైటులోకి వెళ్ళండి. ఇక్కడ అన్ని పుస్తకాలూ ఉచితంగానే లభిస్తాయి. ఇది పూర్తిగా ఉచిత సేవ. మీ జన్మ సమయం, తేదీ, ప్రాంతం చెప్పాలి. భవిష్యత్తులో సొంతంగా ఒక సాఫ్టువేర్ తయారుచేసి పూర్తిగా వేదప్రమాణపరంగా ఎవరికివారు అన్నీ సొంతంగా తెలుసుకునేలా ప్రయత్నిస్తాం. కానీ, అందుకు కొన్ని సంవత్సరాల కాలం పట్టొచ్చు.

మరి, వైష్ణవులందరమూ ఈ జూన్ నెల 23వ తేదీ నుంచీ జూలై 23 వ తేదీ వరకూ దీక్షను చేపడదామా?

అందరికీ, కర్క సంక్రాంతి శుభాకాంక్షలు!

www.VEDAuniversity.com

bottom of page